- రూ.2.5 లక్షలకు బేరం
- బ్రోకర్లతో అమ్మించేందుకు యత్నించిన ముఠా
- తల్లిదండ్రులు సహా 10 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు
హైదరాబాద్,వెలుగు: పసికందులను విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు అయ్యింది.15 రోజుల బాబును రూ.2.5 లక్షలకు విక్రయించేందుకు యత్నించిన పది మంది సభ్యుల ముఠాను సిటీ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. బాబు తల్లిదండ్రులు సహా 8 మంది బ్రోకర్లను అరెస్టు చేసి చాంద్రయాణగుట్ట పోలీసులకు అప్పగించారు.
టాస్క్‌ఫోర్స్ డీసీపీ సుదీంద్ర తెలిపిన వివరాల ప్రకారం..ఫలక్‌నుమా వట్టేపల్లికి చెందిన మెహిది అలీ అలియాస్ సలీం చిల్లర వ్యాపారులకు కమీషన్ బేసిస్‌లో డబ్బు ఇచ్చేవాడు. ఈ క్రమంలోనే సంతానం లేనివారికి పిల్లలను విక్రయించేందుకు ప్లాన్ చేశాడు. ఇందులో భాగంగా అత్తాపూర్ నంబర్ పహాడ్‌కు చెందిన షేక్ ఇస్మాయిల్, సుల్తానా బేగం దంపతులకు 15 రోజుల క్రితం పుట్టిన బాబును రూ.2.5 లక్షలకు కొనుగోలు చేస్తానని ఆఫర్ చేశాడు.
ఆ తరువాత పాతబస్తీ సులేమాన్ నగర్‌కు చెందిన బ్రోకర్లు ఫాతిమా, సయ్యద్ ఇంతియాజ్ పాష, నజ్మా బేగం, ఫెరోజ్‌ఖాన్, సయీద్ షేక్, కిషన్ బాగ్‌కు చెందిన నఫీజ్ బేగం,సయిద్ బేగ్‌ను సంప్రదించాడు. అంతా కలిసి కస్టమర్ల కోసం వెతికారు. బాబు ఫొటోస్‌ను వాట్సాప్‌లో సర్క్యులేట్ చేశారు. సమాచారం అందుకున్న సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిఘా పెట్టారు. బాబు తల్లిదండ్రులు సహా 8 మందిని అరెస్ట్ చేశారు. బాబును చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు అప్పగించారు.