సామాజిక సేవ ముసుగులో దందా.. నలుగురు ముఠా సభ్యుల అరెస్ట్

సామాజిక సేవ ముసుగులో దందా.. నలుగురు ముఠా సభ్యుల అరెస్ట్

చార్మినార్, వెలుగు: సామాజిక సేవ ముసుగులో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇప్పిస్తామని పలువురిని మోసం చేసిన నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఛత్రినాక పీఎస్​లో టాక్స్ ఫోర్స్ అడిషనల్ డీసీపీ అందే శ్రీనివాస్ రావు గురువారం ఈ కేసు వివరాలను వెల్లడించారు. ఛత్రినాక ప్రాంతానికి చెందిన ఎం.జ్యోతి(49), సునీల్ సింగ్(43), రమేశ్(43), నితిన్ కుమార్(23) ముఠా సభ్యులు. 

తొలుత వీరు మండల, ఇతర గవర్నమెంట్​ఆఫీసుల్లో ఆయా పత్రాలు పొందడానికి ప్రజలకు సహాయం చేసేవారు. ఈ క్రమంలో డబుల్ బెడ్ రూమ్​ఇండ్లు ఇప్పిస్తామని ఒక్కొక్కరి నుంచి రూ.10 వేల – 20 వేలు వసూలు చేసినట్లు పోలీసులకు సమాచారం అందింది. రెవెన్యూ శాఖకు చెందిన పలు నకిలీ రబ్బరు స్టాంపులను ఈ ముఠా సభ్యులు తయారు చేయడమే కాకుండా నకిలీ రశీదులు, పత్రాలతో ప్రజలను మోసం చేస్తున్నట్లు గుర్తించారు. గురువారం సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్, ఛత్రినాక పోలీసులు కలిసి వీరిని అరెస్ట్ చేశారు. 

నిందితుల నుంచి మండల కార్యాలయాలకు చెందిన నకిలీ రబ్బరు స్టాంపులు, పత్రాలు, నాలుగు సెల్ ఫోన్లు, రూ. లక్ష నగదు, కాలర్ ప్రింటర్ ను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి మరిన్ని వివరాలు వెల్లడిస్తామని డీసీపీ తెలిపారు. కేసులో భారీ సంఖ్యలో బాధితులు ఉండే అవకాశం ఉందన్నారు.