ఆదిలాబాద్‎లో గ్యాంగ్ వార్ కలకలం..​ పాత కక్షలతో యువకుడి హత్య

ఆదిలాబాద్‎లో గ్యాంగ్ వార్ కలకలం..​ పాత కక్షలతో యువకుడి హత్య

ఆదిలాబాద్​టౌన్, వెలుగు: ఆదిలాబాద్‎లో గ్యాంగ్​వార్​నేపథ్యంలో ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. హంతకులను పోలీసులు ఆరు గంటల్లోనే పట్టుకున్నారు. డీఎస్పీ ఎల్ జీవన్​రెడ్డి టూటౌన్​ పోలీస్​స్టేషన్‎లో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు. పట్టణంలోని క్రాంతినగర్‎కు చెందిన కొమ్మవార్​రవితేజ(26) ను మహాలక్ష్మివాడకు చెందిన గోవింద్​కార్తీక్​అలియాస్​ గోల్డెన్​కార్తీక్, ఇంద్రానగర్‎కు చెందిన చెల్కల ప్రణీత్, దేవుల సాయికిరణ్​హత్య చేశారు. నిందితులు ముఠాగా ఏర్పడి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ, కొంత కాలంగా రవితేజను తమ గ్యాంగ్‎లో చేరాలని ఒత్తిడి తెస్తున్నారు. 

మృతుడు వేరే వారితో కలిసి ఉండడాన్ని జీర్ణించుకోలేక, మంగళవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో రవితేజ ఇంటికి వెళ్తుండగా అడ్డగించి గొడవకు దిగారు. రవితేజను ప్రణీత్, సాయికిరణ్​పట్టుకోగా గోల్డెన్​కార్తీక్​కత్తితో మెడపై 7 సార్లు పొడవడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే చనిపోయాడు. అనంతరం నిందితులు పరారయ్యారు. 

నిందితుల నుంచి బటన్​చాక్, మూడు సెల్​ఫోన్లు, ఒక స్కూటీని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. మృతుడి భార్య ప్రవళిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సీఐ కరుణాకర్​రావు, ఎస్సై విష్ణు ప్రకాశ్, వన్​టౌన్​ సీఐ సునీల్, సీసీఎస్​ సీఐ చంద్రశేఖర్, జైనథ్​సీఐ సాయినాథ్, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.