- మిల్లులో పనిచేసిన హమాలీలే దొంగలు
జైపూర్(భీమారం), వెలుగు: భీమారం మండల కేద్రంలోని అగ్రికల్చర్ మార్కెట్ గోదాం(ఏఎంసీ)లోని వడ్ల బస్తాలను ఎత్తుకెళ్లిన ఐదుగురు సభ్యులు గల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్ లో శ్రీరాంపూర్ సీఐ డి.మోహన్ వివరాలు వెల్లడించారు. మండలంలోని అంకుషాపూర్ గ్రామానికి చెందిన దుర్గ ఇండస్ట్రీస్ రైస్ మిల్లు ఓనర్ దర్శనాల రమేశ్ వడ్ల బస్తాలను ఏఎంసీ గోదాంలో నిల్వ ఉంచారు. అదే గోదాంలోకి హమాలి పనికి వెళ్లిన మండల కేంద్రానికి చెందిన మల్లెత్తుల ప్రశాంత్, దాసరి చంద్రమౌళి, పందుల మధుకర్, బొంతల మధుకర్, మల్లెతుల రమేశ్గోదాంలోని వడ్లను చోరీ చేసేందుకు ప్లాన్వేశారు.
గోదాం షటర్ తాళం పగులగొట్టి, దాన్ని పోలిన మరో తాళం వేసి కొద్దిరోజుల క్రితం రాత్రి సమయంలో 75 వడ్ల బస్తాలు దొంగిలించి ట్రాలీ ఆటోల ద్వారా మహారాష్ట్రలోని సిరొంచలో వడ్లను అమ్ముకున్నారు. ఈ నెల 16న రాత్రి కూడా గోదాం నుంచి వడ్లను ట్రాలీలో లోడ్ చేసుకున్నారు. స్థానికులు గమనించడంతో అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసులకు సమాచారం అందించగా అక్కడకి చేరుకొని విచారణ జరిపారు. ఓనర్ రమేశ్ ఫిర్యాదు మేరకు విచారణ జరిపి ఈ ముఠాను పట్టుకున్నారు. ఐదుగురిపై కేసు నమోదు చేసి వారి నుంచి రూ.59 వేల నగదు, 20 వడ్ల బస్తాలు, రెండు ట్రాలీ అటోలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండుకు తరలించినట్లు సీఐ తెలిపారు. సమావేశంలో ఎస్ఐ రాములు, సిబ్బంది పాల్గొన్నారు.