భద్రాచలం, వెలుగు: బస్తర్ దండకారణ్యంపై చత్తీస్గఢ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి ఎయిర్స్ట్రయిక్స్ చేశాయని దక్షిణ బస్తర్ డివిజన్ కార్యదర్శి గంగ గురువారం ఆరోపించారు. ఈ మేరకు కొన్ని ఫొటోలను ఆమె విడుదల చేశారు. ఈ నెల 7వ తేదీన చత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్- సుక్మా జిల్లాల సరిహద్దుల్లోని పామేడు అటవీ ప్రాంతంలోని పాలగూడ, ఇత్తాగూడ, జిలోర్గడ్డ, గొమ్మగూడ, కంచాల ఆదివాసీ గ్రామాలపై రాత్రి 11.45గంటల నుంచి దాదాపు అరగంట సేపు రాకెట్ లాంచర్లతో సైన్యం దాడి చేసిందని పేర్కొన్నారు.
గడిచిన నాలుగు నెలల్లో 11 కొత్త బేస్ క్యాంపులను ఏర్పాటు చేసి, 2 కిలోమీటర్లకు ఒక క్యాంపు చొప్పున పెట్టి 81 ఎంఎం, 51 ఎంఎం రాకెట్ లాంఛర్లు బాంబులతో నింపి ట్రక్కుల నిండా తరలించారని ఆరోపించారు. డ్రోన్లు, రాకెట్ లాంచర్లతో నిత్యం బాంబు దాడులు చేస్తున్నారని, అమాయక ఆదివాసీలతో పాటు వన్యప్రాణులు కూడా చనిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సీఆర్పీఎఫ్, కోబ్రా, బస్తర్ ఫైటర్స్, ఎస్టీఎఫ్, డీఆర్జీ తదితర బలగాలను ఊళ్లమీదకు పంపించి బూటకపు ఎన్కౌంటర్లు చేయించడం, అక్రమంగా అరెస్ట్ చేయించి అమాయకులను జైళ్లలో పెట్టడం వంటి నిర్బంధ కాండను కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పామేడు అడవుల్లో 30కి పైగా రాకెట్ లాంచర్లతో దాడులు చేస్తే పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయని, చెట్లు విరిగిపోయాయని విమర్శించారు. వాటి ఫొటోలను రిలీజ్ చేశారు. ఇప్ప పువ్వు సేకరించే ఆదివాసీలు అడవుల్లోకి పోవాలంటేనే భయపడుతున్నారన్నారు. ఆదివాసీలపై జరుగుతున్న ఈ దమనకాండను ప్రతీ ఒక్కరూ ఖండించాలని తన లేఖలో కోరారు.