జగిత్యాల, వెలుగు : ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అనుచరుడు, జగిత్యాల రూరల్ మండలం జాబితాపూకు చెందిన గంగారెడ్డి హత్యకు పాతకక్షలే కారణమని పోలీసులు తేల్చారు. ఈ మేరకు ఎస్పీ అశోక్ శుక్రవారం ఓ ప్రకటన రిలీజ్ చేశారు. గంగారెడ్డికి, అదే గ్రామానికి చెందిన బత్తిని సంతోష్‌కు కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. సంతోష్ తండ్రి లచ్చన్నకు, అతడి పెద్దనాన్నకు పదిహేనేండ్ల నుంచి భూ వివాదం నడుస్తోంది. ఈ వివాదంలో గంగారెడ్డి తన పెదనాన్నకు మద్దతు ఇచ్చినట్లు సంతోష్ అనుమానం పెంచుకున్నాడు.
అలాగే 2020లో తనపై నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసులోనూ గంగారెడ్డి హస్తం ఉందని అనుమానించాడు. ఈ కేసులో రాజీ కుదర్చాలని గంగారెడ్డి వద్దకు వెళ్లగా దుర్భాషలాడడంతో సంతోష్ పగ పెంచుకున్నాడు. గంగారెడ్డిని ఎలాగైనా హత్య చేయాలని ప్లాన్ చేసిన సంతోష్ కారు రెంట్‌కు తీసుకున్నాడు. ఈ నెల 22న రోడ్డుపై వెళ్తున్న గంగారెడ్డిని కారుతో ఢీకొట్టిన తర్వాత కత్తితో పొడిచి హత్య చేసిన అనంతరం కారు, మొబైల్ అక్కడే వదిలేసి పారిపోయాడు. గంగారెడ్డి భార్య లక్ష్మి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు శుక్రవారం సంతోష్‌ను అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపరిచారు. హత్య వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా ? అనే కోణంలో విచారణ చేస్తున్నామని ఎస్పీ వెల్లడించారు.