నరేంద్ర మోడీ నాయకత్వంలో ఎన్డీయే పవర్లోకి రాగానే తీసుకున్న పెద్ద నిర్ణయాల్లో గంగా నది ప్రక్షాళన ఒకటి. ‘రామ్ తేరీ గంగా మైలీ (దేవుడా, గంగమ్మ మైల పడింది)’ అనే మాటను తుడిచిపెట్టేయాలని కంకణం కట్టుకున్నారు. మూడేళ్లలో గంగమ్మకు మునుపటి కళ తెస్తామని అప్పటి రివర్స్ డెవలప్మెంట్, గంగా క్లీన్‌నెస్ శాఖల మంత్రి ఉమా భారతి కూడా చెప్పారు. ఈ మాటలు చెప్పి అయిదేళ్లవుతోంది. మరి.. ఆమె అన్నట్లు గంగ నిజంగా పొల్యూషన్ నుంచి బయటపడిందా? నదిని కాలుష్యం నుంచి కాపాడటానికి ప్రారంభించిన ‘నమామీ గంగే’ ఎంతవరకు వచ్చింది? అనుకున్న రీతిలో ప్రాజెక్ట్ ముందుకు సాగకపోవడాన్ని ప్రధానమంత్రి మోడీ చాలా సీరియస్‌గా తీసుకున్నారు. ఇటీవల తానే స్వయంగా రివ్యూ చేశారు. కాన్పూరులో పడవపై గంగా నదిలో తిరిగి కొత్త డెడ్‌లైన్‌ని ఫిక్స్ చేశారు. వచ్చే ఏడాది 2020లోగా పూర్తి చేయాలని ఆదేశించి వచ్చారు.
ఈ నేపథ్యంలో నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగ (ఎన్ఎంసీజీ) అమలు చేస్తున్న ఈ ప్రాజెక్టు స్టేటస్ ఆసక్తికరంగా మారింది. దీనికోసం మోడీ ప్రభుత్వం గడచిన ఐదేళ్లలో రూ.20 వేల కోట్లకుపైనే ఇచ్చింది. మూడు దశల్లో పనులు పూర్తి చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం.
మోడీ రాకతో మొలకెత్తిన ఆశలు
నిజానికి గంగను క్లీన్ చేసే ప్రయత్నాలు 30 ఏళ్ల కిందటే మొదలయ్యాయి. 1986లో గంగా యాక్షన్ ప్లాన్–1ని ప్రారంభించారు. 2014 నాటికి రూ.4 వేల కోట్లకుపైగా ఖర్చు చేశారు. అయినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉండిపోయింది. గంగ పరిస్థితి మరింత క్షీణించింది. ఈ దశలో మోడీ నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం వచ్చింది. 2015లో ‘నమామీ గంగే’కి శ్రీకారం చుట్టడంతో కొత్త ఆశలు మొలకెత్తాయి. భారీ బడ్జెట్ ఇవ్వటమే కాకుండా ఈ ప్రాజెక్టు తన పర్సనల్ అజెండాలో ఉందని, 2019 నాటికి పూర్తి చేస్తామని మోడీ చెప్పారు. లేటెస్ట్గా ఆ డెడ్‌లైన్‌ని 2020కి పొడిగించారు.
ఎన్జీసీ తొలి భేటీ
నమామీ గంగే అమలుకోసం నది ప్రవహించే ఐదు రాష్ట్రాల్లో ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ గ్రూపులు, ఫీల్డ్ ఆఫీసులు, నేషనల్ గంగా కౌన్సిల్ (ఎన్జీసీ) ఏర్పాటు చేశారు. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ సీఎంలు, కేంద్ర మంత్రులు సభ్యులుగా ఉండే ఎన్జీసీ బోర్డు ఏటా భేటీ కావాలి. ఆ మీటింగ్ తొలిసారిగా ఈ మధ్యనే కాన్పూర్‌లో జరిగింది. దానికి మోడీ అధ్యక్షత వహించి, ‘నమామీ గంగే’ను రివ్వ్యూ చేశారు. ప్రాజెక్టు ప్రారంభమైన నాలుగేళ్లలో ఎన్జీసీ మొదటిసారి సమావేశం కావటం విడ్డూరం.
శుభ్రపడుతున్నది కొంతే
గంగా నదిని శుభ్రం చేయటంలో సీవేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ల ఏర్పాటుదే కీలక పాత్ర. రోజుకు 2,000 మిలియన్ లీటర్ల (ఎంఎల్డీ)కు పైగా మురుగు నీటిని క్లీన్ చేయటం ప్రాజెక్ట్ టార్గెట్. ఇప్పుడు 328 ఎంఎల్డీనే శుద్ధి చేస్తున్నారు. భూసేకరణ ఆలస్యంగా జరుగుతుండటం వల్ల కొత్త ట్రీట్మెంట్ ప్లాంట్ల ఏర్పాటు లేటవుతోందని సర్కారు అంటోంది. ప్రస్తుతం ఉన్న ప్లాంట్ల పనితీరు కూడా అశించినంతగా లేదనే టాక్ వినిపిస్తోంది. దీంతో కొత్త డెడ్‌లైన్ లోపు లక్ష్యం చేరగలమా అనే డౌట్లు వస్తున్నాయి.
ప్రవాహం తగ్గి ప్రాబ్లమ్స్
సహజంగా నదుల్లో సెల్ఫ్ ప్యూరిఫైయింగ్ సిస్టమ్ ఉంటుంది. నీరు కంటిన్యూగా ప్రవహిస్తే అది ఆటోమేటిక్‌గా పనిచేస్తుంది. కానీ… క్లైమేట్ చేంజ్ ప్రభావంతోనూ, ఎగువన రిజర్వాయర్ల నిర్మాణంతోనూ గంగా నదిలో ప్రవాహం తగ్గింది. వానా కాలంలో తప్ప మిగతా సమయాల్లో సెల్ఫ్ ప్యూరిఫైయింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అవుతోంది. ఈ బేసిక్ సిస్టమ్ పనిచేయాలంటే నదిలో ఎప్పుడూ నీళ్లు భారీగా పారేలా చూడాలని ఎక్స్‌పర్ట్‌లు సూచిస్తున్నారు. క్లీన్ గంగా ప్రాజెక్టును సక్సెస్ చేయటం కన్నా ఈ ఫండమెంటల్ సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టాలంటున్నారు. వర్షా కాలంలో పరవళ్లు తొక్కుతూ ప్రవహించే గంగా నదిలో ఎండాకాలం మోకాళ్ల లోతు నీళ్లు ఉండట్లేదని ఎక్స్‌పర్ట్‌లు చెబుతున్నారు.
బురదతోనే డేంజర్
ఢిల్లీకి చెందిన ‘సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్’ అనే ఎన్జీవో లెక్కల ప్రకారం గంగా బేసిన్లో బురద బాగా పేరుకుంటోంది. ఈ నది ప్రవహించే ఐదు రాష్ట్రాలు ‘ఓపెన్ డెఫకేషన్ ఫ్రీ (ఓడిఎఫ్)’ అయినాగానీ, రోజుకు 180 ఎంఎల్డీ స్లడ్జ్ (రొంపి/బురద/అడుసు) తయారవుతోంది. సీవేజీ ట్రీట్మెంట్ గనుక సక్రమంగా జరగకపోతే గంగా నది మరింత ఘోరంగా మారే ప్రమాదముంది. మురుగు నీటి కన్నా ఇదే పెద్ద డేంజర్. మామూలు సీవరేజీ బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ (బీఓడీ) 150–300 ఎంజీ/లీ కాగా, దానికి ఫీకల్ స్లడ్జ్ (ఘన, ద్రవ వ్యర్థాల బురద) కలిస్తే బీఓడీ కాస్తా 15,000–30,000 ఎంజీ/లీ అవుతుంది.
రేట్లు డబులయ్యాయి
మన దేశంలో గంగా నది 2,525 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. అంత పొడవునా ప్రవాహం కలుషితం కాకుండా చూడటం చాలా పెద్ద టాస్క్. దాని కన్నా ముఖ్యమైంది ఫైనాన్స్. యూపీలోని గంగా బేసిన్ టౌన్లలో సీవేజీ నెట్వర్క్ ఏర్పాటుకే రూ.5,694 కోట్లు కావాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఇది మొత్తం ‘నమామీ గంగే’ బడ్జెట్లో నాలుగో వంతు. 2010 లెక్కల ప్రకారం లీటర్ సీవేజీ ట్రీట్మెంట్ ఖర్చు ఒక్క పైసా. ఇప్పుడు ఆ రేట్లు డబుల్ అయ్యాయి. ప్రాజెక్టు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సరిగా లేదని ‘కాగ్’ 2017 డిసెంబర్ రిపోర్ట్‌లో తప్పుబట్టింది.
కలిసికట్టుగా పనిచేయట్లే
ఇది భారీ ప్రాజెక్టు కావటంతో టాస్కులూ పెద్ద సంఖ్యలోనే ఉంటాయి. అవి అనుకున్న టైమ్‌కి పూర్తి కావాలంటే ఎన్నో డిపార్టుమెంట్ల మధ్య కోఆర్డినేషన్ ఉండాలి. వాటర్ రిసోర్సెస్ మినిస్ట్రీ 10 శాఖలతో ఎంఓయూలు కుదుర్చుకుంది. కానీ, ఆ మినిస్ట్రీలు ఎలా పనిచేస్తున్నాయో తెలిపే వివరాలేవీ అందుబాటులో లేవు. డిపార్టుమెంట్ల మధ్య సమన్వయం లేకపోవటం మరో పెద్ద సమస్యగా మారింది. ఈ సమస్యను ‘గంగా యాక్షన్ ప్లాన్ మొదలుకొని ఇప్పటి నమామీ గంగే వరకు’ పరిష్కరించలేకపోయారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.