- ఆ నీళ్లు తాగడానికి పనికిరావు.. ఉత్తరాఖండ్ పీసీబీ నివేదికలో వెల్లడి
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ వద్ద గంగా నది నీళ్లు కలుషితం అయ్యాయని, ఆ నీళ్లు స్నానానికి తప్ప తాగడానికి పనికి రావని ఆ రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (పీసీబీ) వెల్లడించింది. ప్రతి నెలా హరిద్వార్ చుట్టూ ఎనిమిది ఏరియాల్లో గంగా నది నుంచి నీటి శాంపిల్స్ సేకరించి టెస్ట్ చేస్తున్నామని, తాజాగా నవంబర్ నెలలో సేకరించిన శాంపిల్స్ ను టెస్ట్ చేశామని తెలిపింది. ఈ టెస్టులు, వాటి ఫలితాల వివరాలతో బుధవారం ఒక నివేదికను పీసీబీ విడుదల చేసింది. సాధారణంగా నీటి స్వచ్ఛతను 4 అంశాల (పీహెచ్ విలువ, బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్, నీటిలో కరిగిన ఆక్సిజన్, కోలిఫాం బ్యాక్టీరియా) ఆధారంగా ఏ, బీ, సీ, డీ, ఈ అనే 5 కేటగిరీలుగా నిర్ధారిస్తారు.నీటి స్వచ్ఛత ‘ఏ’ కేటగిరీలో ఉన్నట్టు తేలితే ఆ నీరు అతి తక్కువ విషపూరితమని, తాగవచ్చని చెప్తారు. అలాగే ‘ఈ’ కేటగిరీలోని నీళ్లు అత్యంత విషపూరితంగా పేర్కొంటారు. అయితే, నవంబర్ లో జరిపిన టెస్టుల్లో హరిద్వార్ వద్ద గంగా నది నీళ్లు ‘బీ’ కేటగిరీలో ఉన్నట్టు తేలిందని పీసీబీ తన నివేదికలో వెల్లడించింది. ఆ నీరు తాగడానికి పనికిరావని తెలిపింది.
ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి..
ఉత్తరాఖండ్ పీసీబీ రిపోర్టుపై ఉజ్వల్ పండిట్ అనే స్థానిక పూజారి ఆందోళన వ్యక్తం చేశారు. మానవ వ్యర్థాల వల్లే గంగాజలం స్వచ్ఛత దెబ్బతింటున్నదని తెలిపారు. "గంగాజలంలో స్నానం చేయడం ద్వారా మన వ్యాధులు నయమవుతాయి. ఇప్పుడు గంగాజలాన్ని తీసుకుని 10 ఏండ్ల తర్వాత పరీక్షిస్తే అందులో ఎలాంటి కాలుష్యం కనిపించదని ప్రజలకు చెబుతున్నాం. కానీ అది ఇప్పుడు అబద్ధం అయిపోయింది. గంగాజలాల స్వచ్ఛత దెబ్బతినడానికి మానవ వ్యర్థాలే కారణం. దీన్ని మనం మార్చాల్సిన అవసరం ఉంది. గంగా నది కాలుష్య నివారణకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి" అని పూజారి పేర్కొన్నారు. కాగా, మన దేశంలోని నదులలో, ముఖ్యంగా ఢిల్లీలోని యమునా నదిలో కాలుష్యం గత కొన్నేళ్లుగా తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. ఈ నెల1న యమునా నదిపై విషపూరిత నురుగు తేలుతూ కనిపించింది. దాదాపు నదులన్నీ కాలుష్యం అవుతుండటంపై పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.