- వైభవంగా ప్రారంభమైన గంగాపూర్ జాతర
- నేడు ఘనంగా రథోత్సవం
ఆసిఫాబాద్, వెలుగు: ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలోని గంగాపూర్ బాలాజీ వేంకటేశ్వర స్వామి జాతర మంగళవారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. మూడ్రోజుల పాటు జాతరకు తొలి రోజు భక్తులు పోటెత్తారు. వేద పండితులు నారాయణ శర్మ, ధీరజ్ శర్మ, అర్చకులు గణేశ్, దినేశ్ శర్మ వేదమంత్రాలతో పూజలు నిర్వహించారు. భాజాభజంత్రీలు, ముత్యాల తలంబ్రాలతో వేంకటేశ్వర స్వామి, అలివేలుమంగ, పద్మావతి కల్యాణోత్సవం కనులపండువగా జరిగింది.
తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి సిబ్బంది తీసుకొచ్చిన పట్టువస్త్రాలను ఆలయాధికారులకు అందజేశారు. కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే దంపతులు హాజరై స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. కుంకుమార్చన, పుష్పాభిషేకం, అర్చన తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఏఎస్పీ చిత్తరం జన్ దంపతులు, ఆర్డీవో లోకేశ్వర్ రావు, సింగరేణి సంస్థ బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ శ్రీనివాస్ ఆలయంలో పూజలు చేశారు. బుధవారం సాయంత్రం 6.15 గంటలకు రథోత్సవం నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.