వేములకొండ గుట్టపై 30 వేల చింత గింజలు.. ప్రకృతిపై ప్రేమచాటుకుంటున్న లింగస్వామి

అశోకుడు చెట్లు నాటించెను అని.. నాటి నుంచి నేటి వరకు పుస్తకాల్లో చెప్పుకుంటూనే ఉన్నాం. చదువుతూనే ఉన్నాం. వింటూనే ఉన్నాం. ఇటీవల కాలంలో ఇదే సూత్రంతో రాజకీయ పార్టీలు సైతం మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తున్నాయి. రోజురోజు పెరిగిపోతున్న గ్లోబల్ వార్మింగ్ నుంచి భూమిని రక్షించుకోవటం కోసం తమ వంతు ప్రయత్నంలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం గోల్నేపల్లి గ్రామానికి చెందిన గంగాపురం లింగస్వామిగౌడ్ అనే వ్యక్తి వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. 

గత కొన్నేళ్లుగా వర్షాకాలంలో తమ మండలంలోని కొండలు, గుట్టల్లో చింత గింజలు చల్లుతూ.. చింత చెట్ల వృద్ధికి కృషి చేస్తున్నారు లింగస్వామి. ఇందులో భాగంగానే ఈ ఏడాది వేములకొండ గుట్ట రోడ్డుకు ఇరువైపులా 30 వేల చింత గింజలను చల్లారు. ఈ గింజల ద్వారా కనీసం వంద మొక్కలు మొలిచి.. వృక్షాలుగా మారినా.. తన వంతుగా ప్రకృతికి సేవ చేసినట్లేనని అంటున్నారు లింగస్వామిగౌడ్. 

పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యతను రేపటి తరానికి తెలియజేసేందుకు.. తన కుటుంబ సభ్యులను, పిల్లలను కూడా భాగస్వామ్యం చేస్తున్నారు. పిల్లలతో చింత గింజలను చల్లిస్తూ.. అందులో వంద గింజలు చెట్లుగా మారినా.. మన ప్రయత్నం సఫలం అయినట్లే అంటున్నారు. గంగాపురం లింగస్వామిగౌడ్ కృషిని.. గతంలోనే మంత్రి కేటీఆర్ తోపాటు ప్రభుత్వం అభినందించిన విషయం తెలిసిందే.