Sankranti Special : మకర సంక్రాంతిపై పురాణాల్లో ఏముందీ.. ఈ పండుగ ఇచ్చే సందేశం ఏంటీ.. ఆచారం వెనక ఆరోగ్యం ఎలా..!

సంక్రాంతి పండుగలో చెప్పుకోవాల్సిన మరో ప్రత్యేకత గంగిరెద్దులు. వీటిని ఆడించేవాళ్లు గంగిరెద్దులతో వీధుల్లో తిరుగుతూ, డోలు, సన్నాయి వాయిస్తారు. అందుకు అనుకూలంగా గంగిరెద్దులతో ఆటలు ఆడిస్తారు. మోకాళ్ల మీద వంగి, వాళ్ల గుండెలపై కాళ్లు పెట్టి గంగిరెద్దులు ఆడుతుంటే చూడముచ్చటగా ఉంటుంది. 'అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు' అని వాళ్లు చెప్తుంటే ఎద్దులు చేసే విన్యాసాలు ఆకట్టుకుంటాయి. 

ఎద్దుల మోపురాన్ని శివలింగంలా భావిస్తారు. దానిని రంగురంగుల దుస్తులతో అలం- కరిస్తారు. కాళ్లకు గజ్జెలు కడతారు. ఈ పండుగరోజు గంగిరెద్దులు ఇంటి ముందు వచ్చి నిలబడటాన్ని జానపదులు శుభంగా భావిస్తారు. వ్యవసాయానికి ఆధారమైన ఎద్దుకు సంతోషంగా కానుకలు ఇచ్చి పంపిస్తారు. కానీ, ప్రస్తుతం సిటీల్లోనే కాదు గ్రామాల్లోనూ గంగిరెద్దులను ఆడించే వాళ్లు తగ్గిపోతున్నారు. ఒకప్పుడు జనవరి మొత్తం కనిపించే వాళ్లు, ఇప్పుడు పండుగ మూడు రోజుల్లో కూడా అక్కడక్కడ కనిపిస్తున్నారు.

ALSO READ | సంక్రాంతికి ఊరికి పోదాం.. ఇలా సంబరాలు చేద్దాం

కొత్త సంవత్సరంలో ఫస్ట్ పండుగ సంక్రాంతి. ఇది జానపదుల పండుగ, కష్టపడి పండించిన పంటలు ఇళ్లకు చేరే సమయంలో చేసుకునే సంబురం. అన్నింటికి మించి పర్యావరణాన్ని పూజించుకునే వేడుక. గంగిరెద్దుల ఆటలతో, హరిదాసుల సంకీర్తనలతో, అమ్మాయిల గొబ్బి పాటలతో, కొత్త అల్లుళ్ళ రాకతో ఊరంతా సందడిగా మారే రోజు సంక్రాంతి.

ఆచారం... ఆరోగ్యం

మకర సంక్రాంతిని 'పంటకోతల పండుగ'. 'కుప్ప నూర్పిడుల పండుగ' అని కూడా పిలుస్తారు. పంట ఇంటికి వచ్చిన తర్వాత, మళ్లీ కొత్త పంట వేయడానికి కావాల్సినవి సిద్ధం చేసుకోవాలన్న సోయి కూడా ఈ పండుగలో ఉంది.

 ఇక, 'క్రాంతి' అంటే వెలుగు, అభివృద్ధి అని రెండు అర్థాలు ఉన్నాయి. 'సం' అంటే చేరుకోవడం. సంక్రాంతి పండుగ అంటే వెలుగును ఆహ్వానించడమే. సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే రోజు మకర సంక్రాంతి. ఈ రోజును పవిత్ర పుణ్య దినంగా భావిస్తారు. ఈ పుణ్య ఘడియలు ఆషాఢశుద్ధ ఏకాదశి వరకు ఉంటాయి. 

ALSO READ | Sankranti Special: భోగి మంట ఎందుకు వేస్తారు.. పిల్లలకు భోగి పళ్లు ఎందుకు పోస్తారు.. విశిష్ఠత తెలుసుకుందామా..!

ఈ రోజు కొత్త కుండలో పాలు పొంగించి, కొత్త బియ్యం, కొత్త బెల్లంతో పొంగలి వండుతారు. మకరరాశికి అధిపతి శని. అందుకే ఈ రోజు శనికి ప్రీతికరమైన నల్లనువ్వులు, బెల్లంతో చేసిన లడ్డూలు, గుమ్మడికాయలు దానం చేస్తారు. ఇలా చేస్తే ఆరోగ్యం, సిరిసంపదలు వృద్ధి చెందుతాయని విశ్వాసం. నువ్వులు, బెల్లం తినడం వల్ల వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. 

ఈ రోజున ఏ దైవాన్ని పూజించినా, యజ్ఞం చేసినా విశేష ఫలితం ఉంటుందని నమ్ముతారు. అంతేకాదు ఈ రోజున పితృదేవతల ప్రీతి కోసం తర్పణాలు వదులుతారు.

మకరం.. పురాణం 

మకర సంక్రాంతిలో 'మకరం' అంటే 'మొసలి' అని అర్ధం. నీళ్లలో మొసలి పట్టుకుంటే వదలదు. సుఖాలకు అలవాటుపడిన మనిషి మొసలి నోటిలో చిక్కుకున్న వాడితో సమానం. దాని తాలూకు బాధలనుంచి తప్పించుకోలేడు. సంక్రాంతి రోజు గుడికి వెళ్లి శివుడికి అభిషేకం చేస్తారు. కొందరు నదుల్లో స్నానం చేసి, ఉపవాసం ఉంటారు. 

అలాగే ఈ పండుగకు సూర్యుడికి సంబంధం ఉంది. పురాణాల ప్రకారం సూర్యుడు ఇంద్ర, వరుణ, వాయుదేవతల సాయంతో వర్షాలు కురిపిస్తాడు. అందుకే ఈ రోజు పొంగలిని సూర్యుడికి నై వేద్యంగా పెడతారు. నీళ్లతో సూర్యుడికి నివేదన కూడా ఇస్తారు. 

పండగ సందేశం 

సంక్రాంతి రోజు సూర్యుడు మకరరాశిలోకి అడుగుపెడతాడు. మకర రాశికి శని అధిష్టాన దేవత. వరుసల ప్రకారం సూర్యుడు, శని తండ్రీకొడుకులు. అయితే వాళ్లిద్దరికి అసలు పడదు. కానీ ఈ పండుగరోజు కలుస్తారు. 

ALSO READ | సంక్రాంతి దేనికి ప్రతీక.. ఎందుకు జరుపుకుంటారో తెలుసా..

అందుకే సంక్రాంతి పండుగని శత్రువులుమిత్రులు అనే తేడా లేకుండా అందరూ కలిసి జరుపుకోవాలని పెద్దలు చెప్తారు. అలాగే సంక్రాంతి 'శంకర' అనే పదం నుంచి వచ్చిందని అంటారు. 'శంకర' అంటే కదలిక అనే అర్థం. ప్రాణం ఉంటేనే కదలిక ఉంటుంది. గ్రహాల కదలిక వల్లే సృష్టి నడుస్తుంది. భూమి కూడా తన చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. 

మనిషి కూడా ఎప్పుడూ కదలిక లేకుండా నిశ్చలంగా ఉండిపోకూడదు. జీవి కదలిక ఉత్సవం లాంటిదనే చెప్పడమే ఈ సంక్రాంతి పండుగ చెప్పే రహస్యం. ప్రస్తుతం మనుషుల జీవితాల్లో ఏదో ఒక ఆందోళన సాధారణం అయిపోయింది. జీవితంలో చెడు కానీ, మంచి కానీ చిన్న మార్పు వచ్చినా తట్టుకునే శక్తి ఉండటం లేదు. శారీరక, మానసిక రోగాల బారిన పడుతున్నారు. మనసు, శరీరాల్లో కదలిక లేకుండా ఉండే కన్నా. ఎప్పటికప్పుడు మార్పును తీసుకోగలగాలని ఈ పండుగ మనకు సందేశమిస్తుంది. 

అనుబంధాల కాంతి 

ఇళ్లల్లో తాతయ్యలు, బామ్మలు 'పొద్దెక్కుతోంది.. స్నానం చేయి.. కొత్త బట్టలు వేసుకో' అని హడావిడి పెడుతుంటారు. అమ్మానాన్నలు.. అక్కాబావలు, బాబాయి, పిన్ని... అందరూ ఒకదగ్గర చేరి.. ముచ్చట్లు పెడుతుంటారు. 

వాళ్ల జీవితాల్లో చిన్నప్పుడు జరిగిన సంఘటనల గురించి బోలెడు కబుర్లు చెప్పుకుంటుంటారు. చిన్న పిల్లలంతా కొత్త బట్టలు వేసుకుని అల్లరి చేస్తుంటారు. వంటింట్లో బంధువులు ముచ్చట్లలో మునిగి.. నోరూరించే వంటలు చేస్తుంటారు. అందరూ కలవడం అనేదే గొప్ప ఆలోచన. ఇక అందరూ కలిసి సంతోషంగా గడిపితే.. అదే పండగ! అనుబంధాలకు సంక్రాంతి స్వచ్ఛమైన సంబురం.

హరిదాసులు

ముఖం మీద తిరునామాలు. కాళ్లకు గజ్జెలు. చేతిలో చిడతలు, నెత్తిమీద రాగితో చేసిన పాత్ర పెట్టుకొని సంక్రాం తికి హరిదాసులు తిరుగుతుంటారు. చిడతలు వాయిస్తూ, కీర్తనలు పాడుతూ. వాటికి అనుకూలంగా అడుగులు వేస్తూ ప్రతి వాకిలికి వెళ్తారు. అందరూ తమ స్థాయిని బట్టి హరిదాసుకు బియ్యం. కూరగాయలు, డబ్బుల రూపంలో దానం చేస్తారు. 

హరిదాసును విష్ణు మూర్తికి సంకేతంగా భావిస్తారు. తల మీద ఉండే గిన్నెను భూమికి ప్రతీక అని చెప్తారు. లోకంలో ఉండే సుఖాలకు లొంగిపోయి దేవుడిని మర్చిపోవద్దని హరిదాసు కీర్తనలు పాడతాడు. అలాగే ఎక్కువ. తక్కువ అనే తేడా లేకుండా అందరూ సమానమని చాటిచెప్పే హరిదాసు కీర్తనల్లో, రూపంలో ఉంటుంది. 

వంటలు 

 సంక్రాంతి రోజు పాలు పొంగిస్తారు. వాటితో పొంగలి చేస్తారు. పరమాన్నం, పులిహోర, గారెలు... వంటలు చేసుకుం టారు. పిండివంటల విషయానికి వస్తే అరిసెలు, బూరెలు, జంతికలు, సకినాలు చేసుకుంటారు. అలాగే లడ్డూలు, బూంది, మురుకులు, సేమియా పాయసం కూడా వందుకుంటారు. మన సంప్రదాయాలకు ప్రతీకలైన పండుగ ల్లో సంక్రాంతి ముఖ్యమైనది. భోగభాగ్యాల తో, సిరిసంపదలను కురిపిస్తూ, కొత్తకాం తులను విరజిమ్ముతూ, కొత్తధాన్యాలతో సంక్రాంతి లక్ష్మీ అందరికీ సంతోషం పంచాలన్నదే ఈ పండుగ ఇచ్చే మెసేజ్..