నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ లో దారుణం జరిగింది. భర్తతో గొడవపడి ఇల్లు వదిలి బయటకు వచ్చిన మహిళపై ఓ ఆటో డ్రైవర్ తన స్నేహితులతో కలిసి గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డాడు. పోలీసుల ప్రకారం.. నిజామాబాద్ టౌన్ కు చెందిన 32 ఏండ్ల వివాహిత శుక్రవారం భర్తతో గొడవపడి ఇంటి నుంచి బయటకు వచ్చింది. రాత్రి 11 గంటలకు బస్టాండ్‌లో ఒంటరిగా ఉన్న సదరు మహిళతో స్వామి అనే ఆటో డ్రైవర్ మాట కలిపాడు.
ఇంట్లో దిగబెడతానని నమ్మబలికి ఆమెను తన ఆటోలో ఎక్కించుకున్నాడు. ఆటోను రూట్మళ్లించి డిచ్ పల్లి వైపు తీసుకెళ్లి రోడ్డు పక్కన ఆపాడు. అప్పటికే స్వామి స్నేహితులు మోసిన్, సుల్తాన్, జైను అక్కడే ఉన్నారు. నలుగురు కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. శనివారం ఉదయం బాధిత మహిళ వన్‌టౌన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బాధిత మహిళను మెడికల్ టెస్టుల కోసం ఆస్పత్రికి తరలించారు.