వరంగల్‌‌‌‌లో దొంగల హల్‌‌‌‌చల్‌‌‌‌.. హడలెత్తిపోతున్న ప్రజలు

  •     వరంగల్‌‌‌‌ నగరంలో రెండు రోజుల్లోనే పది చోరీలు
  •     హడలెత్తిపోతున్న ప్రజలు
  •     8 స్పెషల్‌‌‌‌ టీమ్స్‌‌‌‌ ఏర్పాటు చేసిన ఆఫీసర్లు
  •     పోలీసుల అదుపులో నలుగురు నిందితులు ?

హనుమకొండ, వెలుగు : గ్రేటర్‌‌‌‌ వరంగల్‌‌‌‌లో అంతర్రాష్ట్ర దోపిడీ దొంగల ముఠాలు హల్‌‌‌‌చల్‌‌‌‌ చేస్తున్నాయి. స్పెషల్‌‌‌‌ ఎక్విప్‌‌‌‌మెంట్‌‌‌‌ వాడుతూ డోర్ల గొళ్లాలు, తాళాలు విరగొట్టి అందినకాడికి దోచుకెళ్తున్నారు. గత రెండు రోజుల్లోనే గ్రేటర్‌‌‌‌ పరిధిలో 10 చోరీలు జరగడంతో ప్రజలు హడలెత్తిపోతున్నారు. దీంతో స్పందించిన సీపీ రంగనాథ్‌‌‌‌ దొంగలను పట్టుకునేందుకు స్పెషల్‌‌‌‌ టీమ్స్‌‌‌‌ ఏర్పాటు చేసి గాలింపు చేపడుతున్నారు. అయితే కమిషనరేట్‌‌‌‌ పరిధిలో ఏటికేడు చోరీలు పెరిగిపోతుండగా.. వాటిని నియంత్రించడంలో పోలీసులు వెనుకబడిపోతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి

మధ్యప్రదేశ్‌‌‌‌ ముఠా పనేనా..?

వరంగల్, కాజీపేట స్టేషన్ల ద్వారా ఇతర రాష్ట్రాలకు వెళ్లేందుకు రైల్‌‌‌‌ కనెక్టివిటీ ఉండడంతో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హరియాణా, రాజస్థాన్‌‌‌‌ రాష్ట్రాలకు చెందిన దోపిడీ ముఠాలు గ్రేటర్‌‌‌‌ను తరచూ టార్గెట్​చేస్తున్నాయి. మధ్యప్రదేశ్ గ్యాంగ్‌‌‌‌లు అపార్ట్‌‌‌‌మెంట్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నాయి. గతంలో కాజీపేట పీఎస్​పరిధిలోని పీజీఆర్​అపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌లోని మూడు ఫ్లాట్లలో సుమారు 40 తులాల బంగారం, రూ.22 లక్షలు ఎత్తుకెళ్లారు. ఇద్దరు ఏసీపీలు, ముగ్గురు సీఐలు, ఇద్దరు ఎస్సైలు ఉన్న అపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌లోనే చోరీ జరగడం అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. ప్రస్తుతం జరుగుతున్న చోరీలు కూడా మధ్యప్రదేశ్‌‌‌‌ గ్యాంగే చేస్తోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

చోరీకి వచ్చిన వారు కేవలం 5 నుంచి 10  నిమిషాల్లోనే పని పూర్తి చేస్తుండడం గమనార్హం. మంగళవారం చోరీలు జరిగిన ఓ ఏరియాలోని సీసీ టీవీలో మధ్యప్రదేశ్‌‌‌‌ రిజిస్ట్రేషన్‌‌‌‌ ఉన్న కారు కనిపించడంతో దుండగులు అదే కారులో వచ్చి చోరీలు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా తాళాలను సైలెంట్‌‌‌‌గా కట్‌‌‌‌ చేసేందుకు దుండగులు ప్రత్యేకమైన ఎక్విప్‌‌‌‌మెంట్‌‌‌‌ వాడుతున్నట్లు తెలుస్తోంది.

నలుగురు నిందితుల గుర్తింపు

వరంగల్‌‌‌‌లోని గాయత్రి, వద్దిరాజు అపార్ట్‌‌‌‌మెంట్లలో రెండు, హనుమకొండ పీఎస్‌‌‌‌ పరిధిలోని లహరి, కల్లెడ, మారుతీ వాసవి నిలయం అపార్ట్‌‌‌‌మెంట్లలో ఐదు చోరీలు జరుగగా, మొత్తం 155 తులాలకు పైగా బంగారం పోయింది. వరంగల్ పుప్పాలగుట్టలోని ముత్యాలమ్మ గుడి వద్ద బుధవారం మూడు ఇండ్లలో చోరీ జరిగింది. దీంతో వరంగల్ సీపీ రంగనాథ్‌‌‌‌ సిటీ లిమిట్స్‌‌‌‌లో ఉన్న పోలీసులను అలర్ట్‌‌‌‌ చేశారు. వరుస చోరీల గ్యాంగ్‌‌‌‌ను పట్టుకునేందుకు ప్రత్యేకంగా ఎనిమిది టీంలు ఏర్పాటు చేశారు. బుధవారం సాయంత్రం నలుగురు నిందితులను పట్టుకున్నట్లు సమాచారం. వారి నుంచి పూర్తి సమాచారం సేకరిస్తున్నట్లు తెలిసింది. 

భయాందోళనలో ప్రజలు

కమిషనరేట్​పరిధిలో 53 పీఎస్​లు ఉండగా ఇందులో గ్రేటర్‌‌‌‌ పరిధిలోనే 11 స్టేషన్లు ఉన్నాయి. సీపీ, ఈస్ట్, సెంట్రల్‌‌‌‌ జోన్‌‌‌‌ డీసీపీలు, వరంగల్, హనుమకొండ, కాజీపేట ఏసీపీలు, సీసీఎస్, టాస్క్‌‌‌‌ఫోర్స్‌‌‌‌ ఇలా వివిధ రకాల పోలీసు బలగాలున్న నగరంలో జరుగుతున్న వరుస చోరీలు ఇటు ప్రజలకు, అటు పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మొన్నటివరకు బండ్ల చోరీలతో ఆందోళన చెందిన గ్రేటర్ ప్రజలు ఇప్పుడు ఇండ్లలో దొంగతనాలతో బెంబేలెత్తిపోతున్నారు.

ఇదిలాఉంటే చోరీ కేసుల ఛేదనలో పోలీసులు వెనుకబడిపోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కమిషనరేట్‌‌‌‌ పరిధిలో చోరీ కేసుల పరిష్కారం 50 శాతం కంటే తక్కువగానే ఉందంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.

ఇతర రాష్ట్రాల వాళ్లే.. 

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్లే చోరీలు చేస్తూ పరార్‌‌‌‌ అవుతున్నారు. వారిని పట్టుకునేందుకు స్పెషల్‌‌‌‌ టీమ్స్‌‌‌‌తో గాలింపు చేపడుతున్నాం. వారు వరంగల్‌‌‌‌లో మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా చోరీలకు పాల్పడినట్లు సమాచారం ఉంది. త్వరలోనే పట్టుకుంటాం.

- ఏవీ.రంగనాథ్, వరంగల్ సీపీ