- వాట్సప్ గ్రూపులు, కొరియర్ల ద్వారా ఇండ్లకు సప్లయ్
- ఈవెంట్లు, ఫంక్షన్లకు బల్క్ ఆర్డర్లు
- 4 నెలల కింద శంషాబాద్ ఎక్సైజ్ లిమిట్స్‌లో దందా వెలుగులోకి
- అప్పటినుంచి పెరిగిన ఎక్సైజ్ శాఖ నిఘా
- తాజాగా మేడ్చల్‌లో 800 బాటిళ్లు దొరకడంతో ఎంక్వైరీ
- మంత్రుల స్థాయిలో ఒత్తిళ్లు రావడంతో కేసును తొక్కిపెట్టిన పెద్దాఫీసర్లు
నల్గొండ, వెలుగు: ప్రీమియం లిక్కర్.. ఢిల్లీ నుంచి తెలంగాణకు అడ్డదారిలో సప్లయ్ అవుతున్నది. భారీ కంటైనర్ల ద్వారా సరుకును హైదరాబాద్‌కు తెప్పించి, అక్కడి నుంచి ఏజెంట్లు, కొరియర్ల ద్వారా ఎంపిక చేసిన వినియోగదారులకు చేరుస్తున్నారు. మార్కెటింగ్ కోసం ప్రత్యేక వాట్సప్ గ్రూపులను ఏర్పాటు చేసుకున్నారు. ఈవెంట్లు, ఫంక్షన్లకు బల్క్ ఆర్డర్లు అందజేస్తున్నారు. రాష్ట్రంలోని ప్రీమియం బ్రాండ్ల ఎంఆర్పీతో పోలిస్తే ఢిల్లీలో సగానికన్నా తక్కువ రేట్లకే లిక్కర్ దొరుకుతుండడంతో కొందరు ముఠాలుగా ఏర్పడి ఈ దందా సాగిస్తున్నారు.
ఇందులో స్థానిక లీడర్ల హస్తం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. నాలుగు నెలల క్రితం శంషాబాద్ ఎక్సైజ్ లిమిట్స్‌లో ప్రీమియం లిక్కర్ పట్టుబడడంతో తొలిసారి ఈ బాగోతం వెలుగుచూసింది. దీనిపై నిఘా పెట్టిన ఎక్సైజ్ ఆఫీసర్లు ఇటీవల మేడ్చల్‌లో జరిగిన ఓ ఈవెంట్లో భారీ ఎత్తున ప్రీమియం లిక్కర్ సీజ్‌చేశారు. అక్కడి ఏజెంట్ఇచ్చిన సమాచారంతో 60 మంది ఇండ్లలో దాడులకు రెడీ అయ్యారు. పది ఇండ్లలో తనిఖీలు చేయగానే, ఆపేయాలంటూ పై నుంచి ఒత్తిళ్లు వచ్చాయి. దీంతో రెయిడ్స్అర్ధంతరంగా ఆపేసినట్లు తెలుస్తున్నది. ఢిల్లీ లిక్కర్పాలసీ రూపకల్పనతో పాటు రిటైల్ జోన్లలోనూ తెలంగాణ నేతలు, వ్యాపారులకు వాటాలు ఉన్నట్లు ఆరోపణలు రావడం, అక్కడి నుంచి ఇక్కడికి ప్రీమియం బ్రాండ్లు కంటైనర్లలో వస్తుండడం, ఎక్సైజ్ శాఖ రెయిడ్స్‌ను మంత్రుల స్థాయిలో అడ్డుకోవడంపై ఆబ్కారీ శాఖలో జోరుగా చర్చ జరుగుతున్నది.
రాష్ట్రంలో అడ్డగోలు రేట్లు
రాష్ట్రంలోని వైన్స్‌లో కొంతకాలంగా ప్రీమియం బ్రాండ్లు దొరకడం లేదు. అక్కడక్కడ దొరికినా అడ్డగోలు రేట్లు ఉంటున్నాయి. ఉదాహరణకు బ్లాక్ లేబుల్ బ్రాండ్ విస్కీ(750 ఎంఎల్) ధర ఢిల్లీలో రూ.1,750 ఉంటే.. తెలంగాణలో రూ.4,820కి అమ్ముతున్నారు. గోల్డ్ లేబుల్ రేటు ఢిల్లీలో రూ.1,800 ఉంటే, మన దగ్గర రూ.7,220కు విక్రయిస్తున్నారు. ఇలా ఇక్కడికి, అక్కడికి రెండు మూడు రెట్ల తేడా ఉండడంతో ఇదే అదనుగా కొన్ని ముఠాలు ప్రీమియం లిక్కర్ దందాకు తెరతీసినట్లు తెలుస్తున్నది. భారీ లాభాలకు ఆశపడి పలువురు లీడర్లు కూడా చేతులు కలిపినట్లు అనుమానిస్తున్నారు. ఈ ముఠాలు హైదరాబాద్‌లోని ఎగువ మధ్యతరగతి, సంపన్న వర్గాలను టార్గెట్‌గా చేసుకొని వ్యాపారం చేస్తున్నట్లు ఎక్సైజ్ఆఫీసర్లు గుర్తించారు. గంజాయి స్మగ్లర్లు చేస్తున్నట్లుగానే వాట్సప్ గ్రూపులు క్రియేట్చేసి, కావాల్సిన వాళ్లకు ఏజెంట్లు, కొరియర్ల ద్వారా సప్లయ్ చేస్తున్నట్లు పసిగట్టారు. ఈ ముఠాలు ఒకేసారి నాలుగైదు వందల కార్టన్ల ప్రీమియం లిక్కర్ ను ఢిల్లీ నుంచి తెప్పించుకొని.. శంషాబాద్, గచ్చిబౌలి, ముషీరాబాద్, సికింద్రాబాద్‌లలోని రహస్య ప్రదేశాల్లో నిల్వ చేసి, కావాల్సిన వాళ్లకు సప్లై చేస్తున్నారు. తక్కువ రేట్లకే దొరుకుతుండడంతో చాలా మంది ఎగబడుతున్నారు. ఈవెంట్లు, పెద్ద ఫంక్షన్లు ఉన్నప్పుడు బల్క్‌ఆర్డర్లు ఇస్తున్నారు. ఇదంతా నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ కావడంతో ఎక్సైజ్ఆఫీసర్లు నిఘా పెట్టారు.
పర్మిషన్ల తీగ లాగితే..
నాలుగు నెలల కిందట శంషాబాద్ ఎక్సైజ్ లిమిట్స్‌లో జరిగిన ఘటనతో ప్రీమియం లిక్కర్ గుట్టు బయటకు వచ్చింది. హైదరాబాద్, దాని చుట్టుపక్కల నిర్వహించే భారీ ఫంక్షన్లు, ఈవెంట్లకు ఆబ్కారీ శాఖ నుంచి పర్మిషన్ తప్పనిసరి. ఈ క్రమంలో శంషాబాద్ పరిధిలో జరిగిన ఓ ఈవెంట్‌కు ఎక్సైజ్అధికారులు అప్పట్లో పర్మిషన్ ఇచ్చారు. దీన్ని అవకాశంగా తీసుకొని అదే ఆఫీసులో పనిచేస్తున్న ఇద్దరు క్లర్కులు నకిలీ చలానాలు సృష్టించి మరో 10 ఈవెంట్స్‌కు అడ్డదారిలో అనుమతులిచ్చారు. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలియడంతో ఎంక్వైరీ చేసి బాధ్యులైన ఇద్దరు క్లర్కులను సస్పెండ్ చేశారు. ఈ వ్యవహారంలో లోకల్ ఎక్సైజ్ అధికారుల ప్రమేయం కూడా ఉందని గుర్తించిన పై ఆఫీసర్లు హైదరాబాద్ చుట్టుపక్కల జరిగే ఈవెంట్స్, ఫంక్షన్ హాల్స్‌పై నిఘా పెట్టారు. ఈ క్రమంలో ఉన్నతాధికారులు విస్తుపోయే నిజాలు రాబట్టారు. ఢిల్లీ నుంచి తెలంగాణకు నాన్ డ్యూటీ పెయిడ్ జానీవాకర్, సింగిల్ మ్లాట్ బ్రాండ్లు అక్రమ మార్గంలో సప్లయ్ అవుతున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో ఒకటి, రెండు ఫంక్షన్ హాల్స్ ను సీజ్ చేసిన ఉన్నతాధికారులు.. ఈ నెల 3న మేడ్చల్ శివారులో జరిగిన ఓ ఈవెంట్‌పై రెయిడ్స్ చేశారు. రూ.12 లక్షల 57 వేల 940 విలువైన 233 బాటిళ్ల బ్రాండెడ్ లిక్కర్ స్వాధీనం చేసుకున్నారు. ఈవెంట్ మేనేజర్, బాటిళ్లు సప్లై చేసిన వ్యక్తితోపాటు, మరో ముగ్గురుని అదుపులోకి తీసుకుని విచారించగా ముఠా గుట్టు రట్టయింది. మద్యం సప్లయ్ చేసిన వ్యక్తి వద్ద దొరికిన డైరీలో 60 మంది ప్రముఖుల పేర్లు, అడ్రస్‌లు ఉండటంతో అప్రమత్తమైన ఉన్నతాధికారులు అప్పటికప్పుడు ఐదు స్పెషల్ టీమ్‌లను రంగంలోకి దింపారు. ఏకకాలంలో 10 ఇండ్లలో తనిఖీ చేసి.. సుమారు 800 ప్రీమియం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. దాడులు కొనసాగుతున్న క్రమంలోనే పై అధికారుల నుంచి ఫోన్లు రావడంతో రెయిడ్స్ అర్ధంతరంగా ఆపేసినట్లు తెలిసింది.
అధికారులనే ఉల్టా బ్లాక్ మెయిల్ చేస్తున్నరు
ఎక్సైజ్ దాడులను మంత్రుల స్థాయిలో అడ్డుకున్న ప్రముఖులు.. అప్పటికే స్వాధీనం చేసుకున్న 800 బాటిళ్లు తిరిగి ఇవ్వాలని కొద్దిరోజుల నుంచి ఉన్నతాధికారుల పై ప్రెజర్ తీసుకొస్తున్నారు. ‘‘మా బాటిళ్లు మాకు ఇవ్వకుంటే రివర్స్‌లో మీ పైనే కేసులు పెడ్తం’’ అంటూ అధికారులనే బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. తనిఖీలకు వచ్చిన అధికారులు తమపై దాడులు చేశారని, దౌర్జ్యానానికి పాల్పడ్డారని ఉల్టా కేసులు పెడ్తామని హెచ్చరిస్తున్నారు. ఓవైపు లిక్కర్ సేల్స్ పెంచమంటూనే మరోవైపు అక్రమ మద్యాన్ని కంట్రోల్ చేస్తున్న అధికారులను వేధింపులకు గురిచేయడం ఎంతవరకు కరెక్ట్ అని ఓ సీనియర్ ఆఫీసర్‘వెలుగు’తో వాపోయారు.