- బిల్డర్ అజయ్ గోసాలియాపై హత్యాయత్నం కేసులో కోర్టు తీర్పు
ముంబై: బిల్డర్ అజయ్ గోసాలియాపై హత్యాయత్నం కేసులో గ్యాంగ్ స్టర్ ఛోటా రాజన్‌కు ముంబైలోని సీబీఐ ప్రత్యేక కోర్టు 10 ఏండ్ల జైలుశిక్ష విధించింది. ఈ కేసులో రాజన్‌తోపాటు మొత్తం 8 మందిని కోర్టు దోషులుగా తేల్చింది. పదేండ్ల జైలుశిక్షతోపాటు5లక్షల రూపాయల జరిమానా వేసింది. ప్రాసిక్యూషన్ తెలిపిన వివరాల మేరకు.. బుకీ నుంచి బిల్డర్‌గా మారిన 52 ఏండ్ల అజయ్ గోసాలియాపై 2013 ఆగస్టు 28న మర్డర్ అటెంప్ట్ జరిగింది. మలాడ్ (వెస్ట్)లోని ఇన్ఫినిటీ మాల్ నుంచి బయటకు వస్తున్న అజయ్ గోసాలియాపై ముగ్గురు వ్యక్తులు కాల్పులు జరిపారు. గుండెల్లోకి దూసుకెళ్లాల్సిన బుల్లెట్ బంగారు గొలుసులోని పెండెంట్‌కు తాకడంతో అజయ్ గోసాలియా ప్రాణాలతో బయటపడ్డాడు. బుల్లెట్ గాయాలతో ఆస్పత్రిలో చేరాడు. తొలుత ఈ ఘటనపై బంగూర్‌నగర్ పోలీస్ స్టేషన్లో మర్డర్ అటెంప్ట్ కేసు దాఖలైంది. తర్వాత ఈ కేసును సీఐడీకి అప్పగించారు. ఛోటా రాజన్ ఆదేశాల మేరకు అతని అనుచరుడు సతీష్ కాలియా దాడికి పాల్పడినట్టు విచారణలో తేలింది. దీంతో ఛోటా రాజన్, మరో ఏడుగురు నిందితులపై అధికారులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. నిందితులు ప్రకాశ్ నికం, సతీష్ కాలియాను జర్నలిస్టు జే డే హత్య కేసులో పోలీసులు అరెస్టు చేశారు. ఛోటా రాజన్ బాలిలో పట్టుబడిన తర్వాత ఈ కేసును సీబీఐ టేకప్ చేసింది.