తీహార్‌ జైల్లో ఘర్షణ.. గ్యాంగ్‌స్టర్‌ టిల్లు మృతి

ఢిల్లీలోని రోహిణి కోర్టు కాల్పుల ఘటన ప్రధాన సూత్రధారి, గ్యాంగ్‌స్టర్‌ టిల్లు తజ్‌పూరియా మృతి చెందాడు. తీహార్‌ జైల్లో జరిగిన గ్యాంగ్‌ వార్‌లో అతను చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన అతన్ని ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణం పోయిందని వెల్లడించారు.

తీహార్‌ జైలులో గత రాత్రి రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ప్రత్యర్థి గ్యాంగ్‌ చేతిలో తజ్‌పూరియా తీవ్రంగా గాయపడ్డాడు. యోగేష్‌ తుండా, అతని అనుచరులు ఇనుప రాడ్లతో ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. పోలీసులు టిల్లును ఢిల్లీ దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ ఆస్పత్రికి తరలించారు. అయితే... అప్పటికే టిల్లు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. 

ఢిల్లీలో మోస్ట్‌ వాండెటెడ్‌ అయిన గ్యాంగ్‌స్టర్‌ జితేందర్‌ గోగిని గతేడాది సెప్టెంబర్‌లో రోహిణి కోర్టు ప్రాంగణంలోనే  కాల్చి చంపారు ఇద్దరు దుండగులు. ఈ హత్య కేసులో ప్రధాన సూత్రధారి గ్యాంగ్‌స్టర్‌ టిల్లు తజ్‌పూరియానే. అప్పుడు మండోలా జైలు నుంచే అతను జితేందర్‌ హత్యకు ప్రణాళిక వేశాడు. అయితే.. జితేందర్‌ను కాల్చిచంపిన ఇద్దరు దుండగులు అప్పుడే పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో హతమయ్యారు. వీరిని ఉమాంగ్‌ యాదవ్‌, వినయ్‌గా పోలీసులు గుర్తించారు. దీనికి ముందు ఇంటర్‌నెట్‌ కాలింగ్‌ ద్వారా టిల్లుకు వీరిద్దరూ సమాచారం ఇచ్చినట్టు వెల్లడైంది.