కరీంనగర్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం కేసులతో బీఆర్ఎస్ కార్యకర్తలను భయపెడుతోందని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎంపీ వినోద్‌కుమార్ ఆరోపించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పోలీస్ కేసులకు భయపడొద్దని, మీకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రేకుర్తిలోని రాజశ్రీ గార్డెన్స్ లో సోమవారం కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో కరెంట్ రాక... సాగునీరు లేక రైతులు గోస పడుతున్నారన్నారు. మార్పు అంటే పంట మార్పిడా అని ఎద్దేవా చేశారు. మేయర్ సునీల్ రావు, జడ్పీ చైర్ పర్సన్ కె.విజయ, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, బీఆర్ఎస్ సిటీ ప్రెసిడెంట్ హరిశంకర్ పాల్గొన్నారు.
కోర్టులో కేసుల వల్ల నియామకాలు జరగలేదు
తిమ్మాపూర్, వెలుగు: కోర్టుల్లో కేసులు ఉండడం వల్ల నియామకాలు జరగలేదని, బీఆర్‌ఎస్‌పాలనలో 40 వేల ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహించామని మాజీ ఎంపీ వినోద్ కుమార్ తెలిపారు. సోమవారం తిమ్మాపూర్మండలం అలుగునూర్‌లో మానకొండూరు బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి 7వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పడం హస్యాస్పదమన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, కార్పొరేటర్ శారద, ఎంపీపీలు, జడ్పీటీసీలు, లీడర్లు పాల్గొన్నారు.