కరీంనగర్/కొత్తపల్లి వెలుగు: ఎంపీగా గెలిచిన బండి సంజయ్ అభివృద్ధి గురించి ఏనాడు పట్టించుకోలేదని బీఆర్ఎస్ కరీంనగర్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు. కొత్తపల్లి మండలం బావుపేట, అసిఫ్ నగర్ తోపాటు సిటీలోని 48,49,52,12 డివిజన్లలో మేయర్ యాదగిరి సునీల్ రావుతో కలిసి ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఢిల్లీ పార్టీలని బీఆర్ఎస్ ఒక్కటే మన ఇంటి పార్టీ అన్నారు.
కరీంనగర్ అభివృద్ధిని చూసి మరోసారి ఆశీర్వదించి తనను ఎమ్మెల్యే గా గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ ప్రజలకు ఏ ఆపద వచ్చినా తన ఇంటి గేటు 24 గంటలు తెరిచే ఉంటుందని, తన ఫోన్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందన్నారు. బండి సంజయ్ ఎన్నికలు రాగానే మాయమాటలు చెప్పే దొంగ అని, హిందువుల పేరు చెప్పుకుని కాలం గడపడం తప్ప చేసిందేమీ లేదన్నారు. కార్పొరేటర్లు తోట రాములు, నరేందర్, ఫిరోజ్, శ్రీలత- మహేశ్, జడ్పీటీసీ కరుణశ్రీ, లీడర్లు ప్రభావతి, శారద, రాజశేఖర్, మీర్ షౌకత్ అలీ పాల్గొన్నారు.
బీఆర్ఎస్‌లో చేరిన రత్నాకర్
కాంగ్రెస్ మాజీ రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి ఒంటెల రత్నాకర్ శనివారం మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ లో చేరారు. ఆయనతోపాటు కాంట్రాక్టర్ కొప్పుల అజయ్ కుమార్ కూడా పార్టీలో చేరారు.