- భార్య పుస్తెలమ్మి పోటీ చేశానన్న సంజయ్‌కు ఇన్ని కోట్లు ఎక్కడివి
కరీంనగర్, వెలుగు: బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు గెలిస్తే మళ్లీ ఆంధ్రోళ్ల పెత్తనం చేస్తారని బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకొని మాయమయ్యే వ్యక్తి బండి సంజయ్ అని, ఎంపీగా గెలిచాక నాలుగున్నరేళ్లు కరీంనగర్‌కు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో తన భార్య పుస్తెలు అమ్మి పోటీ చేశానని చెప్పుకున్న సంజయ్ కు ఇవాళ కోట్ల రూపాయలు ఎక్కడ నుంచి వచ్చాయని ప్రశ్నించారు.
కరీంనగర్ రూరల్ మండలం దుర్శేడు, ఇరుకుల్ల, వల్లంపహాడ్ గ్రామాలతో పాటు సిటీలోని రాంనగర్ చౌరస్తా, గీతా భవన్ సెంటర్ లో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ అధ్యక్ష పదవి ఇస్తే కోట్లాది రూపాయలు వసూలు చేసి.. ఇప్పుడు ఓటుకు రూ.20వేలు ఇచ్చి గెలిచేందుకు చూస్తున్నాడని ఆరోపించారు. కరీంనగర్ ఎంపీగా గెలిచిన బండి సంజయ్ కేంద్రం నుంచి నిధులు తేవడంలో విఫలమయ్యారని, అసమర్థ బీజేపీ కావాలో, సమర్థ బీఆర్ఎస్ కావాలో ప్రజలు తేల్చుకోవాలన్నారు.
కాంగ్రెస్ అభ్యర్థి కబ్జాకోరు అని, ఆయనకు ఓటేస్తే మీ భూములు మాయం చేస్తాడని హెచ్చరించారు. మేయర్ యాదగిరి సునీల్‌రావు, డిప్యూటీ మేయర్ స్వరూప రాణి, సిటీ ప్రెసిడెంట్ హరిశంకర్, కార్పొరేటర్లు శ్రీకాంత్, మహేశ్, రవి, మాధవి మహేశ్, రమణారావు, ప్రసాద్, హర్ష కిరణ్, మల్లేశం, తిరుపతి, సరిత అశోక్ పాల్గొన్నారు.
గంగులకు ఎంఎస్‌ఎఫ్ మద్దతు
కరీంనగర్ టౌన్ : కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్‌కు ఎంఎస్ఎఫ్ మద్దతు ఇస్తున్నట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మాతంగి రమేశ్, వర్కింగ్ ప్రెసిడెంట్ గాలిపెల్లి శ్రీనివాస్ ప్రకటించారు. ఆదివారం స్థానిక మీసేవ ఆఫీస్‌లో నిర్వహించిన మీడియాతో సమావేశంలో వారు మాట్లాడారు.