రాజగోపాల్ రెడ్డి నాలుగేండ్లకే చేతులెత్తేసిండు : గంగుల కమలాకర్

సంస్థాన్ నారాయణపురం, వెలుగు: నాలుగేండ్లకే పాలన చేతగాక చేతులెత్తేసిన రాజగోపాల్​రెడ్డి మరోసారి పోటీ ఎందుకు చేస్తున్నట్టని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రశ్నించారు. సంస్థాన్ నారాయణపురంలో ఆదివారం కుమ్మరి శాలివాహన ఆత్మీయ సమ్మేళనం సంఘం అధ్యక్షుడు చిలువేరు అంజయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బీజేపీ చేతిలో చిక్కిన రాజగోపాల్ రెడ్డి.. వారు చెప్పినట్లుగా ఉప ఎన్నికకు వచ్చాడని ఆరోపించారు. 400 మంది కుమ్మర్లను గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలకు పంపించి అధునాతన పరికరాలను తయారు చేసేట్టు శిక్షణ ఇప్పించినట్టు తెలిపారు. వారు తెలంగాణలో నాలుగు వేల మందికి శిక్షణ ఇచ్చారన్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్​ తో వినాయక విగ్రహాలను తయారు చేయొద్దనే ఉద్దేశంతో మట్టి వినాయక ప్రతిమల తయారీలో శిక్షణ ఇప్పించామన్నారు. ఇప్పుడు హైదరాబాద్ చుట్టూ అనేకమంది కుమ్మర్లు మట్టి వినాయక విగ్రహాలను తయారు చేస్తున్నారన్నారు. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు, కుమ్మర సంఘం రాష్ట్ర రాజకీయ విభాగ అధ్యక్షుడు రాచకొండ కృష్ణయ్య పాల్గొన్నారు.

కొత్త ఓటర్లు టీఆర్ఎస్ వైపే..

కొత్తగా ఓట్లు వచ్చిన యువకులు ఎప్పుడూ టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలా అని ఎదురుచూస్తున్నారని మంత్రి గంగుల అన్నారు. ఆదివారం సంస్థాన్ నారాయణపురం మండలంలో ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతుండగా కొందరు యువకులు వచ్చి టీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను మెచ్చుకున్నారు. తాము ప్రభుత్వ గురుకుల పాఠశాలలో చదివామని, ఇప్పుడు హైదరాబాద్ ఇతర ప్రాంతాల్లో డిగ్రీలు, పీజీలు చదువుతున్నామని చెప్పారు. దీంతో మంత్రి గంగుల సంతోషం వ్యక్తం చేశారు. వారందరూ టీఆర్ఎస్ కే ఓటేస్తారని ధీమా వ్యక్తం చేశారు.