- సంజయ్ వ్యాఖ్యలతోనే గొడవ జరిగింది : గంగుల కమలాకర్
కరీంనగర్, వెలుగు : ‘ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ని ఏమైనా కొట్టాడా ? కేసులు ఎలా పెడతారు’ అని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రశ్నించారు. జిల్లా సమావేశంలో సంజయ్ చేసిన వ్యాఖ్యలతోనే గొడవ జరిగిందన్నారు. సోమవారం తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. బీఆర్‌ఎస్ బట్టలు విప్పుతానని సంజయ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వల్లే కౌశిక్‌రెడ్డి ‘నీవు ఏ పార్టీ నుంచి గెలిచావు’ అని ప్రశ్నించాడన్నారు. కౌశిక్‌రెడ్డిని మీటింగ్ నుంచి పోలీసులు గుంజుకుపోవడం సరికాదన్నారు.
మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ ఆదేశాలతోనే పోలీసులు సభలోకి వచ్చారా ? అని ప్రశ్నించారు. సమావేశాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వాగ్వాదాలు సాధారణమేనన్నారు. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు చల్లా హరిశంకర్, కార్పొరేటర్లు శ్రీకాంత్, రాములు, మహేశ్ పాల్గొన్నారు.