కరీంనగర్ రూరల్, వెలుగు: సీఎం కేసీఆర్ పాలనలో బడుగు, బలహీన, మైనార్టీల పిల్లలకు ఉన్నతవిద్య అందుతోందని పౌర సరఫరాలు, బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ రూరల్ మండలం ముగ్ధుంపూర్ శివారులో మహిళా వ్యవసాయ కళాశాల నిర్మాణం కోసం గురువారం స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన 15 డిగ్రీ కాలేజీలలో మొదటి మహిళా కాలేజీ వనపర్తిలో, రెండో కరీంనగర్ జిల్లాలో ఏర్పాటు చేసుకుంటున్నామన్నారు. కాలేజీ కోసం 43 ఎకరాల 16 గుంటలు కేటాయించడంతోపాటు రూ.కోటి డీఎంఎఫ్టీ నుంచి నిధులు మంజూరు చేస్తున్నామని మినిస్టర్తెలిపారు. తెలంగాణ రాకముందు 19 బీసీ గురుకులాలు ఉంటే, ఇపుడు సీఎం కేసీఆర్ 310 బీసీ గురుకులాలను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఆయన వెంట జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్, ఎంజేపీ సెక్రటరీ మల్లయ్య భట్టు, అగ్రికల్చరల్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ సుధీర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
క్రిస్మస్ వేడుకల్లో మంత్రి..
కొత్తపల్లి: పట్టణంలోని సీఎస్ఐ చర్చిలో కొత్తపల్లి, కరీంనగర్ మండల పాస్టర్స్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో మినిస్టర్కమలాకర్ పాల్గొన్నారు. క్రీస్తు బోధనలు సమాజ శాంతికి ఉపయోగపడతాయన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, ఎమ్మెల్సీ రాజేశ్వరరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ మధు పాల్గొన్నారు.