రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులు, వారి పంటల వివరాలు వెంటనే నమోదు చేయాలని మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు. ఆగస్టు 2న కరీంనగర్ కలెక్టరేట్ లో నిర్వహించిన సమీక్షలో ఆయన పాల్గొన్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. వరద బాధితులను ఆదుకోవడానికి ప్రభుత్వం ఇప్పటికే రూ.500 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు. మంచినీరు, విద్యుత్తు సరఫరాలో అవాంతరాలు కలగకూడదని అధికారులకు సూచించారు. వర్షాలు కురుస్తున్నందున అంటువ్యాధులు ప్రబలకుండా వైద్యుల్ని అందుబాటులో ఉంచాలన్నారు.
వరద నష్టంపై అంచనాలు సిద్ధం చేసి అసెంబ్లీ సమావేశాలలోపు ప్రభుత్వానికి నివేదిక పంపించాలని చెప్పారు. పంటపొలాల్లో చేరిన ఇసుక మేటలను తొలగించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా వేల ఎకరాల్లో వరి , 788 ఎకరాల్లో పత్తి , 31 ఎకరాల్లో మొక్కజొన్న , 6 ఎకరాల్లో కూరగాయల తోటలు నష్టపోయాయని అధికారులు మంత్రికి తెలిపారు.
దెబ్బ తిన్న కల్వర్టులు, వంతెనలు తదితర మరమ్మతు పనుల్ని చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు కలెక్టర్ డా.బి.గోపీ తెలిపారు.
హుజురాబాద్‌లో తీవ్ర నష్టం..
భారీ వర్షాలకు హుజురాబాద్‌లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి వివరించారు. 4 వేల ఎకరాలకు నీటిని అందించే కాలువలకు కట్టలు తెగిపోవడంతో తీవ్రంగా నష్టం వాటిల్లిందన్నారు. పలు గ్రామాల్లో రోడ్లు ధ్వంసమయ్యాయని మంత్రికి నివేదించారు.
మిగతా ఎమ్మెల్యేలు సైతం తమ తమ నియోజకవర్గాల్లో సమస్యలను మంత్రికి వివరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, ఓడితల సతీష్ బాబు తదితరులు పాల్గొన్నారు.