కేసీఆర్ లేని..తెలంగాణను ఊహించుకోలేం : గంగుల కమలాకర్

  • 50 ఏళ్ల దరిద్రానికి కారణం బీజేపీ, కాంగ్రెస్ లే
  • కాంగ్రెస్​ రౌడీషీటర్‌‌‌‌కు టికెట్ ఇచ్చింది

కరీంనగర్, వెలుగు : కేసీఆర్ సీఎంగా లేని తెలంగాణను ఊహించుకోలేమని, కాంగ్రెస్, బీజేపీకి అధికారమిస్తే తెలంగాణను కుక్కలు చింపిన విస్తరి చేస్తారని రాష్ట్ర మంత్రి, బీఆర్ఎస్ కరీంనగర్ అభ్యర్థి గంగుల కమలాకర్ అన్నారు. తెలంగాణ రాకముందు కాంగ్రెస్​హయాంలో రాత్రి పూట మోటర్లు పెట్టేందుకు వెళ్లి వేల మంది రైతులు పాము కాట్లతో చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ రూరల్ మండలం చర్ల బుత్కూర్, తాహేర్ కొండాపూర్ గ్రామాలతోపాటు, సిటీలోని 3, 24, 25 డివిజన్లలో మంత్రి గంగుల కమలాకర్ శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా గ్రామాలకు వచ్చిన మంత్రి గంగులకు మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ.. హైదరాబాద్ సంపదను దోచుకునేందుకు నాటి పాలకులు బలవంతంగా ఆంధ్రలో కలిపారన్నారు. సమైక్య పాలనలో మన బొగ్గును, గోదావరి జలాలను తరలించుకుపోయారని దీంతో సాగునీరు, కరెంట్ లేక తెలంగాణ రైతులు అరిగోస పడ్డామన్నారు.

స్వయం పాలనలో కాళేశ్వరం జలాలతో తాగు, సాగు నీటిని పరిష్కరించి మండుటెండల్లో చెరువులను మత్తడి దూకిస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలతో కరెంట్ కష్టాలు లేకుండా పోయాయని తెలిపారు. పచ్చని తెలంగాణను చూస్తే ఆంధ్రోళ్లకు కంటగింపుగా ఉందని, మళ్లీ తెలంగాణపై విషం చిమ్ముతున్నారని, సినిమా స్టూడియోలు చూపించి  హైదరాబాద్ తమ సంపద అంటున్నారని అన్నారు.

తెలంగాణలో చిచ్చుపెట్టమని పవన్ కళ్యాణ్ ను చంద్రబాబు పంపించారని, కేవీపీ, షర్మిల, కిరణ్ కుమార్ రెడ్డి కలిసి కేసీఆర్ ను ఓడగొట్టేందుకు గూడుపుఠాణి చేస్తున్నారని ఆరోపించారు. భూకబ్జా కేసులున్న రౌడీ షీటర్ కు కాంగ్రెస్ టికెట్ ఇచ్చిందని, ఆయన గెలిస్తే మన భూములను కబ్జా చేస్తాడని హెచ్చరించారు. ఎంపీగా గెలిచిన తర్వాత బండి సంజయ్ ఎప్పుడైనా కనిపించాడా అని ప్రశ్నించారు.

యాభై ఏళ్ల దరిద్రానికి కారణమైన కాంగ్రెస్, బీజేపీతో తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు. అందుకే ఓటువేసే ముందు ఆలోచించాలని, మోసపోతే గోసపడతామని సూచించారు. పెరిగిన సంపద పేదలకు పంచాలనేదే తమ సర్కార్ ఆలోచన అని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో మేయర్ సునీల్ రావు, బీఆర్ఎస్ సిటీ ప్రెసిడెంట్ చల్లా హరిశంకర్, కార్పొరేటర్లు కుర్ర తిరుపతి, ఎడ్ల సరిత అశోక్, కంసాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.