కరీంనగర్, వెలుగు: తెలంగాణ వచ్చాక కరీంనగర్ సిటీలో రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టి సిటీ రూపురేఖలు మార్చినట్లు రాష్ట్ర మంత్రి, బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ అన్నారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేశానని, తనను మరోసారి ఆశీర్వదించాలని కోరారు. గురువారం అశోక్ నగర్ శివాలయం, టవర్ సర్కిల్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ తెలంగాణను అన్నిరంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్ది, బంగారు తెలంగాణగా మార్చేందుకు సీఎం కేసీఆర్ సుపరిపాలనను అందిస్తున్నారన్నారు.
కాంగ్రెస్, బీజేపీలు సీమాంధ్ర లీడర్లతో కుమ్మక్కై తెలంగాణను దోచుకోవడానికి కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ సర్కారు చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు యావత్ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. రానున్న ఎన్నికల్లో గెలిచేది బీఆర్ఎస్సేనని, మూడోసారి కేసీఆరే సీఎం అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మేనిఫెస్టో అమలుచేస్తామన్నారు.
కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలకు గ్యారంటీ ఎవరని ప్రశ్నించారు. ప్రచారానికి వచ్చిన మంత్రి గంగులకు మహిళలు మంగళహారతులతో బొట్టుపెట్టి స్వాగతం పలికారు. కార్యక్రమంలో మేయర్ యాదగిరి సునీల్ రావు, సిటీ ప్రెసిడెంట్ హరిశంకర్, నాంపల్లి శ్రీనివాస్, శ్రీదేవి -పవన్ కుమార్, లీడర్లు శ్రీనివాస్, గణేశ్, మధు, నరేందర్, శ్రీకాంత్, పాల్గొన్నారు.
కుల సంఘాల మద్దతు
కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్‌కు వివిధ కుల, వ్యాపార సంఘాలు మద్దతు తెలిపాయి. గురువారం క్రిస్టియన్ కాలనీలోని గంగుల ఇంటికి లక్ష్మీనగర్ కురుమ సంఘం ప్రతినిధులు, సిటీలోని విశ్వబ్రాహ్మణ కుల సంఘం నేతలు, కొత్తపల్లి మండలం చింతకుంట గౌడ సంఘం, బుక్క కుల సంఘం నేతలు, శాతవాహన యూనివర్సిటీ జేఏసీ సభ్యులు కలిసి గంగులకు తమ మద్దతును ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ది చేసిన గంగులను నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామన్నారు.