బండి సంజయ్​ వల్లే .. నా మీద ఈడీ, ఐటీ దాడులు : గంగుల కమలాకర్

కరీంనగర్, వెలుగు: బండి సంజయ్ తనకున్న అధికారాన్ని దుర్వినియోగం చేసి తన కుటుంబాన్ని వేధించాడని మంత్రి గంగుల కమలాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తాను భార్యాపిల్లలతో దుబాయ్ వెళ్లినప్పుడు తన ఇంటిపై దాడి చేసి, తాళాలు పగులగొట్టించాడని, దీంతో ఒక్క రోజులో తిరిగి రావాల్సి వచ్చిందని గుర్తు చేశారు. కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని 51,13 డివిజన్ టవర్ సర్కిల్, రామచంద్రపురంకాలనీ, సీతారాంపూర్, ఆరెపల్లి,  తీగలగుట్టపల్లిలో మంత్రి గంగుల కమలాకర్ శుక్రవారం ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా కొన్ని నెలల కింద జరిగిన ఘటనను గుర్తుచేసుకుంటూ గంగుల భావోద్వేగానికి గురయ్యారు. కేంద్ర ప్రభుత్వం తన చేతిలో ఉందన్న అహంకారంతో సంజయ్ సీబీఐ, ఈడీ, ఐటీ శాఖలతో తనపై దుర్మార్గంగా దాడి చేయించారని ఆరోపించారు. పదేళ్ల బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాలనలో కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూపురేఖలు మార్చి గొప్పగా అభివృద్ధి చేశామన్నారు.  సిటీలో కొనసాగుతున్న ఈ అభివృద్ధి మరింత ముందుకు వెళ్లాలంటే కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను గెలిపించుకోవాలన్నారు.

50 ఏళ్లకుపైగా అధికారంలో ఉన్న  కాంగ్రెస్  ప్రజలకు చేసిందేమీ లేదని, నాడు రైతులను గోస పెట్టిందని, కరెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నీళ్లియ్యలేదని, కండ్ల ముందే పంటలు ఎండుతున్నా పట్టించుకోలేదన్నారు. బండి సంజయ్ లాంటి ఎందరు కుయుక్తులు పన్నినా... తనను కడుపులో పెట్టుకొని కాపాడుతున్న కరీంనగర్ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని, కారుగుర్తుకు ఓటేసి తనను ఆశీర్వదించాలని కోరారు.  కార్యక్రమంలో మేయర్ సునీల్ రావు , సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ రవీందర్ సింగ్, కార్పొరేటర్లు జంగిలి సాగర్, తుల రాజేశ్వరి బాలయ్య,  కాశెట్టి శ్రీనివాస్ ఉన్నారు.

మార్నింగ్ వాకర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో గంగుల

మంత్రి గంగుల కమలాకర్ శుక్రవారం ఉదయం ఎస్ఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మార్నింగ్ వాకర్స్ ను కలిసి ఓటేయాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తనను ఎమ్మెల్యేగా గెలిస్తే కరీంనగర్ లో ప్రస్తుతం కొనసాగుతున్న మానేరు రివర్ ఫ్రంట్ పనులు పూర్తవుతాయన్నారు. కార్పొరేటర్లు బండారి వేణు, భూమాగౌడ్, ఎల్లాగౌడ్,  ట్రస్మా శేఖర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు, సూర్యశేఖర్,  చక్రధర్ రావు పాల్గొన్నారు.