కరీంనగర్, వెలుగు: కరీంనగర్ టికెట్‌ను కాంగ్రెస్ భూకబ్జాదారులకు అమ్ముకుంటోందని మంత్రి, బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ ఆరోపించారు. బీ ఫామ్‌లు అమ్ముకునే సంస్కృతి కాంగ్రెస్ పార్టీదని, మాయమాటలు చెప్పి కర్నాటకలో అధికారంలోకి వచ్చిందన్నారు. కరీంనగర్ రూరల్ మండలం చేగుర్తి, నల్లగుంటపల్లి, కరీంనగర్ సిటీలోని కోతిరాంపూర్, కట్టారాంపూర్‌లో ప్రచారం, బీఆర్టీయూ కార్మికుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాక ముందు రైతులు నీటికోసం ఆకాశం వైపు ఎదురుచూసేవారని, ఇప్పుడు బీఆర్‌ఎస్‌పాలనలో కాళేశ్వరం జలాలతో పల్లెలు సస్యశ్యామలమయ్యాయన్నారు. పచ్చని తెలంగాణను చూసి ఆంధ్రా నాయకుల కండ్లు మండుతున్నాయని, అందుకే బీజేపీ, కాంగ్రెస్ముసుగులో మళ్లీ వస్తున్నారన్నారు. కేసీఆర్‌ను ఓడించి తెలంగాణను మళ్లీ ఆంధ్రాలో కలపాలని చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
కరీంనగర్ గడ్డపై నాలుగో సారి గులాబీ జెండా ఎగరేస్తామన్నారు. ఆయా కార్యక్రమాల్లో మేయర్ సునీల్ రావు, కార్మిక నాయకులు రూప్‌సింగ్, శ్రీనివాస్ రెడ్డి, మల్లేశం, రాఘవులు, మిడ్ డే మీల్స్ వర్కర్స్, భవన నిర్మాణ కార్మికులు, ఆటోడ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా పెయింటర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మ్యాక రమాకాంత్‌తోపాటు 100 మంది యువకులతోపాటు పలువురు బీజేపీ నాయకులు మంత్రి సమక్షంలో పార్టీలో చేరారు.