కరీంనగర్, వెలుగు: ఆరు గ్యారంటీలు కాదు.. ఆరు వేల గ్యారంటీలు ఇచ్చినా కాంగ్రెస్ ను ప్రజలు నమ్మరని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కర్నాటకలో ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోనే ఇంతవరకు అమలు చేయలేదని, ఇక తెలంగాణలో ఇచ్చిన హామీలు అమలు చేస్తారంటే ఎలా నమ్మేదన్నారు. ఈ దేశ దరిద్రానికి, తెలంగాణ వెనకబాటుకు కారణమే కాంగ్రెస్ అని మండిపడ్డారు. కరీంనగర్ లోని మీ సేవ ఆఫీసులో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తాము చేసిన అభివృద్ధిని చూపెట్టి ఓట్లడుగుతామని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ముసుగులో కేవీపీ, షర్మిల, బీజేపీ ముసుగులో కిరణ్ కుమార్ రెడ్డి వస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. కరీంనగర్ లో ఓట్లు వేయరనే పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ వెళ్లిపోతుండన్నారు. 18న 30 వేల మందితో ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తానని వెల్లడించారు.
షెడ్యూల్ వచ్చే వరకు బిజిబిజీగా...
సోమవారం ఎన్నికల షెడ్యూల్ వస్తుందని తెలియడంతో మంత్రి గంగుల కమలాకర్ ఉదయం నుంచే నియోజకవర్గంలో మేయర్ సునీల్ రావుతో కలిసి సుడిగాలి పర్యటన చేపట్టారు. కరీంనగర్ అరుంధతినగర్, 22, 25, 42 తదితర డివిజన్లలో గృహలక్ష్మి ప్రొసీడింగ్స్ కాపీలు అందజేశారు. కరీంనగర్ రూరల్ మండలం, కొత్తపల్లి మండలాల్లో సైతం శాంక్షన్ పత్రాలను అందజేశారు.