- బండి సంజయ్ డైలాగ్స్ పేలుతలేవు..
- కరీంనగర్లో ఆయనది మూడో ప్లేసే
- గోషామహల్లో రాజాసింగ్ ఓడిపోతున్నడు
- కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్
కరీంనగర్, వెలుగు : సంచలనాల కోసం బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఏవేవో డైలాగ్లు మాట్లాడుతున్నారని, అవి పేలడం లేదని, తుస్సుమంటున్నాయని మంత్రి, కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ ఎద్దేవా చేశారు. కరీంనగర్ లో నామినేషన్ సందర్భంగా బీజేపీ ఎంపీ బండి సంజయ్, ఎమ్మెల్యే రాజాసింగ్ సోమవారం చేసిన వ్యాఖ్యలకు మంత్రి గంగుల కమలాకర్ కౌంటర్ ఇచ్చారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న సంజయ్ నామినేషన్ వేస్తున్నాడంటే పెద్ద లీడర్లు ఎవరో వస్తారని తాను భావించానని, కానీ బీజేపీ పార్టీ రిజెక్ట్ చేసిన రాజాసింగ్ రావడం ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. ఇతర అభ్యర్థులను గెలిపించాలని బండి సంజయ్కు వాళ్ల పార్టీ వాళ్లు హెలికాప్టర్ ఇస్తే.. ఆయనను గెలిపించేందుకు మరో నాయకుడొచ్చిండని ఎద్దేవా చేశారు.
రేవంత్ రెడ్డిని బలి కా బక్రా అని నిన్న సంజయ్ అన్నాడని, కానీ నిజానికి బలి కా బక్రాలు సంజయ్, రాజాసింగ్ అన్నారు. బీజేపీ నుంచి గెంటేస్తే రాజాసింగ్ కాళ్లావేళ్లాపడి టికెట్ తెచ్చుకున్నాడని విమర్శించారు. ‘రాజాసింగ్ రాసుకో.. నువ్వు వచ్చినందుకు మూడోసారి బండి సంజయ్ మూడో ప్లేస్లో ఉంటడు. మూడో తారీఖు మాట్లాడుకుందాం.’ అని మంత్రి సవాల్ విసిరారు.
ముహూర్తం చూసుకునే బీఫాం తీసుకున్న..
బండి సంజయ్ ముహూర్తం చూసుకుని నామినేషన్ వేసినట్లే, తానూ ముహూర్తం చూసుకుని బీ ఫాం తెచ్చుకున్నానని మంత్రి గంగుల అన్నారు. కరీంనగర్ ప్రజలు శాంతియుత వాతావరణాన్ని కోరుకుంటున్నారని, ఓట్ల కోసం ఇక్కడ చిచ్చు పెట్టకండని బీజేపీ నాయకులను మంత్రి కోరారు. బీసీ సీఎం గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారని, అసలు బీసీ ప్రెసిడెంట్ ను తీసేసినప్పుడే నీకు దిక్కు లేదన్నారు. ఓట్ల కోసం బీజేపీ నాయకులు యువతను ఎంత రెచ్చగొట్టినా వాళ్లు పట్టించుకోవడం లేదన్నారు. కరీంనగర్ ప్రజలు అభివృద్ధే కోరుకుంటున్నారని, విధ్వంసం కోరుకోవట్లేదని వెల్లడించారు. రాజాసింగ్కు గోషామహల్లోనే దిక్కుదివానా లేదని, ఆయనే ఓడిపోతున్నాడని గంగుల జోస్యం చెప్పారు. సమావేశంలో మేయర్ యాదగిరి సునీల్ రావు, బీఆర్ఎస్ సిటీ ప్రెసిడెంట్ చల్లా హరిశంకర్, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు తదితరులు పాల్గొన్నారు.