బీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకతతో బడా నాయకులే ఓడిపోయిన్రు : గంగుల కమలాకర్

కరీంనగర్/కరీంనగర్ టౌన్, వెలుగు: బీఆర్ఎస్​ప్రభుత్వంపై ఏర్పడిన వ్యతిరేకతతో పెద్దపెద్ద నాయకులే ఓడిపోయారని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ చెప్పారు. కరీంనగర్ ప్రజలు మాత్రం కాంగ్రెస్ హామీలు, బండి సంజయ్ సెంటిమెంట్ డైలాగులను కాదని తనను నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలిపించారని ఆనందం వ్యక్తం చేశారు. తన రక్తం ధారబోసైనా కార్యకర్తల రుణం తీర్చుకుంటానని తెలిపారు. 

ఆదివారం కరీంనగర్​లోని కల్యాణమండపంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల మీటింగ్​లో మాజీ ఎంపీ వినోద్ కుమార్​తో కలిసి గంగుల మాట్లాడారు. డిసెంబర్ 9వ తేదీ లోపు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పిన మాట ఏమైందని, పంట చివరి దశకు వచ్చినా సాగు నీరు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. రైతుబంధు కోసం రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారని, బీఆర్ఎస్​కార్యకర్తలు ప్రజల తరఫున కొట్లాడాలని పిలుపునిచ్చారు. కరీంనగర్​ను స్మార్ట్ సిటీగా మార్చానని బండి సంజయ్ చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. 

24న నిర్వహించే పార్లమెంటు స్థాయి సోషల్ మీడియా సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతున్నారని తెలిపారు. సమావేశంలో మేయర్ సునీల్ రావు, బీఆర్ఎస్ సిటీ ప్రెసిడెంట్ చల్లా హరిశంకర్, కొత్తపల్లి ఎంపీపీ పిల్లి శ్రీలత పాల్గొన్నారు. అలాగే అయోధ్య సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం  సిటీలోని రాంనగర్ మార్క్ ఫెడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన హనుమాన్ చాలీసా పారాయణం కార్యక్రమంలో ఎమ్మెల్యే  గంగుల కమలాకర్ పాల్గొన్నారు