దుబాయ్ వేదికగా జరిగిన ఐపీఎల్ 2024 వేలంలో జార్ఖండ్ యువ వికెట్ కీపర్ కుమార్ కుశాగ్ర రికార్డు ధర పలికిన విషయం తెలిసిందే. రూ.20 లక్షల కనీస ధరతో వేలంలో అడుగుపెట్టిన అతని కోసం ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీలు నువ్వా నేనా అన్నట్లు పోటీపడ్డాయి. దీంతో అతడు ఎవరూ ఊహించని విధంగా రూ. 7.2 కోట్ల భారీ ధరకు క్యాపిటల్స్ సొంతమయ్యాడు. అయితే ఈ యువ క్రికెటర్ ఇంత భారీ ధర పలకడం వెనుక భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా కుశాగ్ర తండ్రి శశికాంత్ మీడియాకు వెల్లడించారు.
వేలంలో కుమార్ కుశాగ్ర రూ. 7.2 కోట్ల భారీ ధర పలకడంతో మీడియా ఛానెళ్లు వారి కుటుంబసభ్యుల ఇంటర్వ్యూల కోసం ప్రయత్నించాయి. ఈ తరుణంలో మీడియాతో మాట్లాడిన అతను తండ్రి.. తన కుమారుడికి తానే కోచ్ అని తెలిపారు. అదే సమయంలో ఈడెన్ గార్డెన్స్‌లో ట్రయల్స్ కోసం వెళ్లినపుడు తన కుమారుడి ఆటతీరు చూసి గంగూలీ.. ఐపీఎల్ వేలంలో కుశాగ్ర రూ.10 కోట్లు ధర పలుకుతాడని చెప్పారని వెల్లడించారు.
"ఈడెన్(గార్డెన్స్)లో ట్రయల్స్ జరిగినప్పుడు గంగూలీ.. కుశాగ్ర ఆటను చూసి అతడు త్వరలోనే ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడతాడని, అతని కోసం ఫ్రాంచైజీలు రూ. 10 కోట్లు ఇచ్చేందుకైనా వెనుకాడబోవని మాతో చెప్పారు. కుశాగ్ర సిక్స్ లు కొట్టే తీరు కానీ, అతని వికెట్ కీపింగ్ స్కిల్స్ కానీ గంగూలీని బాగా ఆకట్టుకున్నాయి. అంత సునిశితంగా గంగూలీ అతని ఆటను గమనించారు. అతని వికెట్ కీపింగ్ స్టైల్ ఎంఎస్ ధోనీని పోలి ఉందని మెచ్చుకున్నారు. ఆ సమయంలో నేను నా కుమారుడుని ప్రోత్సహించడానికి గంగూలీ అలా చెప్పారని అనుకున్నా.."
"నిజానికి మేము కుశాగ్రను ఢిల్లీ క్యాపిటల్స్ బేస్ ధరకు సొంతం చేసుకుంటుంది అనుకున్నాం. కుశాగ్రకు ఆట గురించి తెలుసు అంతే. తానెప్పుడూ ఏ స్థాయిలోనూ క్రికెట్ ఆడలేదు. ఏ టోర్నమెంట్లలో పాల్గొనలేదు. తనకు కోచ్ కూడా నేనే. నాకు క్రికెట్ గురించి పరిజ్ఞానం తక్కువే. అయితే ఒకసారి నా కొలిగ్ ఒకరు ఆర్ట్ అండ్ సైన్స్ ఆఫ్ క్రికెట్ బై బాబ్ వూమర్ బుక్‌ను చదవమని చెప్పడంతో దాని చదివి ఎన్నో మెళుకువలు తెలుసుకున్నా. అవే అతన్ని నాణ్యమైన క్రికెటర్ గా తీర్చిద్దిదేందుకు సాయపడ్డాయి.." అని కుమార్ కుశాగ్ర తండ్రి మీడియాకు తెలిపారు.
జార్ఖండ్
కుమార్ కుశాగ్ర స్వస్థలం జార్ఖండ్. 2021లో లిస్ట్ ఏ క్రికెట్‌లో, 2022 ఫిబ్రవరిలో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అరంగ్రేటం చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఇప్పటివరకూ 13 మ్యాచ్‌లు ఆడిన కుశాగ్ర 868 పరుగులు చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో పిన్న వయసులో డబల్ సెంచరీ చేసిన అతడు ఆరో బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. 2022-23 విజయ్ హజారే ట్రోఫీలో 275 పరుగులు చేసిన అతడు.. దేవ్‌దార్ ట్రోఫీలో 227 రన్స్‌తో రాణించాడు. అదే సమయంలో 23 లిస్ట్ ఏ మ్యాచుల్లో 700 పరుగులు, 11 టీ20 మ్యాచ్ లలో 140 పరుగులు చేశాడు.