హైదరాబాద్లో ఎస్సై తల పగలకొట్టిన గంజాయి బ్యాచ్

  • రెండు తులాల గోల్డ్​ చైన్​ చోరీ 
  • మంగర్​బస్తీలో ఘటన.. 

మెహిదీపట్నం, వెలుగు : గంజాయి అమ్ముతున్నారనే సమాచారంతో తనిఖీ చేసేందుకు వెళ్లిన పోలీసులపై గంజాయి బ్యాచ్ దాడులకు తెగబడింది. బీర్​బాటిల్స్ తో ఎస్సై తల పగలగొట్టింది. ఈ ఘటన హబీబ్​నగర్​పోలీస్​స్టేషన్​పరిధిలో జరిగింది. ఇన్​స్పెక్టర్ రాంబాబు తెలిపిన వివరాల ప్రకారం.. గంజాయి తనిఖీల్లో భాగంగా నార్కోటిక్ ఇన్​స్పెక్టర్లు దిలీప్, రాజశేఖర్, సీఐలు దిలీప్, రాజశేఖర్, ఎస్సైలు శివకుమార్, సందీప్, అశోక్, కానిస్టేబుళ్లు మంగళవారం అర్ధరాత్రి హబీబ్​నగర్ పీఎస్​పరిధిలోని మంగర్​బస్తీకి వెళ్లారు.

పోలీసుల రాకను గుర్తించిన పాత నేరస్థుడు, గంజాయి వ్యాపారి కంబ్లీ దీపక్, అతని తమ్ముడు అరుణ్ పారిపోయేందుకు యత్నించారు. పోలీసులు వారిని వెంబడించి దీపక్ ను పట్టుకున్నారు. పోలీస్​స్టేషన్ కు తరలిస్తున్న టైంలో స్థానికులతో కలిసి అరుణ్ అడ్డుకున్నాడు. అంతా కలిసి పోలీసులపై దాడికి దిగారు. బీర్ బాటిల్ తో కొట్టడంతో ఎస్సై శివకుమార్ తలకు గాయమైంది. దాడి టైంలో కొందరు ఎస్సై మెడలోని రెండు తులాల బంగారు గొలుసును లాక్కుని పరారయ్యారు.

చివరికి కంబ్లీ దీపక్, అరుణ్ ను పోలీసులు అరెస్ట్​చేశారు. కేసు ఫైల్​చేసినట్లు ఇన్​స్పెక్టర్ తెలిపారు. గాయపడిన ఎస్సైను హాస్పిటల్​కు తరలించామన్నారు. బుధవారం సాయంత్రం పోలీసులు మంగర్​బస్తీలో కార్డన్​ సెర్చ్ నిర్వహించారు.