హైదరాబాద్ గంజాయి చాక్లెట్లకు అడ్డాగా మారుతోంది... నగర పరిధిలో తరచూ ఎక్కడో ఒకచోట గంజాయి చాక్లెట్ల విక్రయాలు వెలుగులోకి వస్తున్నాయి. బుధవారం ( డిసెంబర్ 18, 2024 ) టీ స్టాల్ ముసుగులో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేయగా.. ఇవాళ ( డిసెంబర్ 19, 2024 ) కిరాణా షాపులో గంజాయి చాక్లెట్ల విక్రయం వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబందించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ లోని జగద్గిరి గుట్టలో ఓ కిరాణాషాపులో భారీగా గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
ముందస్తు సమాచారంతో జగత్రిద్గిరిగుట్ట రింగ్ బస్తీలో కిరాణా దుకాణంపై దాడి చేసిన బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు 61 ప్యాకెట్ల లో ఉన్న 2400 (13 కేజీల) గంజాయి చాక్లెట్లను స్వాదీనం చేసుకున్నారు. కిరాణా షాపు యజమాని బీహార్ కు చెందిన సునీల్ కుమార్ ఝాను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
సునీల్ కుమార్ ఝా 20 ఏళ్ళ క్రితం కూలీ పనుల కోసం బీహార్ నుండి హైదరాబాద్ వచ్చాడని.. కొన్నేళ్ల కిందట కిరాణా షాపు ప్రారంభించిన సునీల్.. బీహార్ నుండి గంజాయి చాక్లెట్లు తెచ్చి వలస కార్మికులకు అమ్ముతున్నట్లు గుర్తించామని తెలిపారు పోలీసులు.
ఒక్కో చాక్లెట్ రూ. 40 కి అమ్ముతున్నట్లు గుర్తించిన పోలీసులు.. స్వాధీనం చేసుకున్న మొత్తం చాక్లెట్ల విలువ రూ.97, 600గా ఉంటుందని తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.