
- విచ్చలవిడిగా గంజాయి తాగడం, మద్యపానం
- జల్సాలు, ఈజీ మనీ కోసం నేరాల బాట
- గ్యాంగ్‌వార్‌ను తలపిస్తున్న గొడవలు
- పోలీసులు అరెస్టు చేసినా నో కంట్రోల్
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లాలో గంజాయి ఘాటు గుప్పుమంటోంది. అక్రమార్జనకు అలవాటుపడ్డ కొంతమంది నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకొని ఈ దందా సాగిస్తున్నారు. ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి గంజాయి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారు. యువతను మత్తులో ముంచుతూ లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. పాతికేండ్లు కూడా నిండని యువకులు ఆ మత్తులో జోగుతూ పెడదోవపడుతున్నారు. జల్సాలు, ఈజీ మనీ కోసం చోరీలు, నేరాలు చేస్తునారు. ఈ క్రమంలో గ్రూపుల మధ్య గొడవలు గ్యాంగ్‌వార్‌ను తలపిస్తున్నాయి.
మద్యం, గంజాయి మత్తులో మర్డర్లకూ తెగబడుతున్నారు. రాత్రివేళల్లో నిర్మానుష్య ప్రాంతాల్లోకి ఒంటరిగా వెళ్లాలంటేనే ప్రజలు జడుసుకునే పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు, ఎక్సైజ్ అధికారులు అడపాదడపా పట్టుకుని కేసులు పెట్టినా కంట్రోల్ కావడం లేదు. వినియోగదారులే విక్రేతలుగా మారడంతో చాపకింద నీరులా గంజాయి దందా విస్తరిస్తోంది.
స్టూడెంట్లు, యువకులే టార్గెట్..
మంచిర్యాలకు ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి భారీ మొత్తంలో గంజాయి రవాణా జరుగుతోంది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాలతో పాటు ఆంధ్ర, ఒడిషా, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి గుట్టుగా రవాణా చేస్తున్నారు. జిల్లాలోని కొన్ని మారుమూల అటవీ ప్రాంత గ్రామాల్లోనూ సాగుచేస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో బెల్లంపల్లి 2 ఇన్‌క్లైన్ పరిధిలోని ఓ ఇంట్లో గంజాయి మొక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అక్రమార్కులు మంచిర్యాల, నస్పూర్, శ్రీరాంపూర్, మందమర్రి, రామకృష్ణాపూర్, బెల్లంపల్లి, చెన్నూర్, లక్సెట్టిపేట ప్రాంతాల్లో నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకొని వారి ద్వారా స్టూడెంట్లు, యువకులే టార్గెట్‌గా అమ్ముతున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా చిన్న చిన్న ప్యాకెట్లుగా, చాక్లెట్లుగా, సిగరేట్లలో నింపి సప్లై చేస్తున్నారు. 100 గ్రాముల ప్యాకెట్ రూ.500 చొప్పున అమ్ముతున్నారు. ఆ మధ్య మంచిర్యాల సంజీవయ్య కాలనీలో ఆరుగురు యువకులు గంజాయి సిగరెట్లు తాగుతుండగా పోలీసులు పట్టుకున్నారు. గత ఫిబ్రవరిలో బెల్లంపల్లి పాలిటెక్నిక్ స్టూడెంట్లు గంజాయి మత్తులో జోగుతూ పట్టుబడడం తెలిసిందే. వీరిలో మైనర్లు కూడా ఉన్నారు. గంజాయి మత్తు సరదాగా అలవాటై క్రమంగా వ్యసనంగా మారుతోంది.
మత్తులో జోగుతూ నేరాలు
యువకులు గంజాయి మత్తులో జోగుతూ విచక్షణ కోల్పోయి చోరీలు, నేరాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు పేర్కొంటున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఐదు నెలలుగా వరుస చోరీలకు పాల్పడుతున్న ఏడుగురు యువకులను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. 19 నుంచి 22 ఏండ్ల లోపు వీళ్లంతా గంజాయికి బానిసలై ఈజీ మనీ కోసం దొంగతనాలు చేస్తున్నారని ఓ అధికారి తెలిపారు. రెండు నెలల కిందట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద అర్ధరాత్రి రెండు గ్రూపులకు చెందిన యువకులు క్రికెట్ బ్యాట్లు, వికెట్లతో గ్యాంగ్‌వార్‌ను తలపించేలా కొట్టుకోవడం సంచలనమైంది.
అంతకుముందు బైపాస్ రోడ్డులో రెండు వర్గాల యువకులు కర్రలతో దాడులు చేసుకున్నారు. నిరుడు అండాళమ్మ కాలనీకి చెందిన కొంతమంది యువకులు గంజాయి మత్తులో సుపారీ మర్డర్‌కు పాల్పడ్డారు. రైల్వే స్టేషన్ సమీపంలో ఓ మహిళను కత్తులతో పొడిచి, తలపై రాయితో మోది దారుణంగా చంపేశారు. రాత్రిళ్లు గ్రూపులుగా బైక్‌లపై తిరుగుతూ, రోడ్లపై బర్త్‌డేలు జరుపుకుంటూ, తల్వార్లతో కేక్ కటింగ్‌లు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. జిల్లా కేంద్రంలో బస్టాండ్, రైల్వేస్టేషన్, బైపాస్‌రోడ్, కాలేజీ రోడ్, రాళ్లపేట, గర్మిళ్ల, అండాలమ్మ కాలనీ, రాజీవ్‌నగర్, గోదావరి రోడ్, ఏసీసీ తదితర ఏరియాలు గంజాయి బ్యాచ్‌లకు అడ్డాలుగా మారాయి.
పోలీసుల నిఘా ఉన్న నో కంట్రోల్
రాష్ర్ట ప్రభుత్వం గంజాయి, డ్రగ్స్ మాఫియాపై సీరియస్‌గా ఉండడంతో పోలీసులు నిఘా పెంచారు. ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి రవాణా చేస్తున్నారన్న సమాచారంతో దాడులు చేసి పట్టుకున్నారు. 2020లో జిల్లాలో ఐదు కేసుల్లో 11 మందిని అరెస్టు చేసి 6.60 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోగా, 2021లో 17 కేసుల్లో 50 మందిని అరెస్టు చేసి 12.72 కిలోలు పట్టుకున్నారు. 2022లో ఏడు కేసుల్లో 18 మందిని అరెస్టు చేసి 7.82 కిలోలు, నిరుడు 49 కేసుల్లో 73 మందిని అరెస్టు చేయగా, నాలుగున్నర క్వింటాళ్లకు పైగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఏడాది కూడా పలువురిని అరెస్టు చేశారు. గంజాయికి బానిసైన యువకులు సైతం విక్రేతలుగా మారి వారి ఫ్రెండ్స్‌కు, తెలిసిన వారికి అలవాటు చేస్తున్నట్టు దర్యాప్తులో తేలింది. ఈ మహమ్మారిని కంట్రోల్ చేయడానికి పోలీసులు మరింత పకడ్బందీ చర్యలు తీసుకోవాలి. గంజాయి దందా చేస్తున్న వారిపై పీడీ యాక్టు పెట్టాలి. గంజాయి బ్యాచ్‌లను పెంచిపోషిస్తూ అసాంఘిక కార్యకలాపాలకు వాడుకుంటున్న వారిపట్ల కఠినంగా వ్యవహరించాల్సిన అవసరముంది.