"పుష్ప" స్టైల్లో గంజాయి రవాణా..అయినా దొరికారు

పుష్ప సినిమాలో ఎర్రచందనం దుంగలను రవాణా చేసేందుకు అల్లు అర్జున్ ఎన్ని టెక్నిక్లు వాడాడో ప్రత్యకంగా చెప్పనక్కర లేదు.  అచ్చం అలాంటి  టెక్నిక్తో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ ముఠా గంజాయి రవాణా చేసేందుకు ప్రయత్నించింది. కోటి రూపాయల విలువైన గంజాయిని పోలీసుల కళ్లు గప్పి ట్రాక్టర్లో తరలిస్తూ పట్టుబడింది. 

ట్రాక్టర్ ఛాంబర్లో.. 

మల్కన్ గిరి, ఒరిస్సా రాష్ట్రానికి చెందిన రఘునాథ్, రవీంద్ర అనే ఇద్దరు ట్రాక్టర్లో 485 కిలోల గంజాయిని ఆంధ్రా- ఒరిస్సా సరిహద్దులలో గల మల్కన్ గిరి నుంచి కరీంనగర్కు  భద్రాచలం మీదుగా అక్రమంగా తరలిస్తున్నారు. వీరు గంజాయిను తరలిచేందుకు ట్రాక్టర్ ట్రాలీకి సీక్రెట్ ఛాంబర్  ఏర్పాటు చేసుకున్నారు. అందులో 5 కిలోల బరువు గల 97 గంజాయి ప్యాకెట్ లను సర్దిపెట్టారు. ఏమీ ఎరగనట్టు ట్రాక్టర్లో వెళ్తున్నారు. 

పోలీసులకు అనుమానం..

మే 29వ తేదీ  ఉదయం కూనవరం రోడ్ చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు తనిఖీలు చేశారు. ట్రాక్టర్ ట్రాలీపై భాగాన చూస్తే తక్కువ లోతు  కనిపిస్తోంది. సైడ్కు చూస్తే కొలత పెద్దగా అనిపిస్తుంది. స్మగ్లర్ల కదలికలు అనుమానంగా అనిపించాయి. దీంతో పోలీసులు మరింత క్షుణ్ణంగా తనిఖీలు చేయగా..అసలు విషయం వెలుగులోకి వచ్చింది.  ట్రాక్టర్ ట్రాలీలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సీక్రెట్ ఛాంబర్లో గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. 5 కిలోల బరువున్న 97 గంజాయి ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువు దాదాపు కోటి రూపాయలు ఉంటుందని తెలిపారు.  ఈ నిందితులు ఇలాగే పలు మార్లు విజయవాడ, గుంటూరు, కరీంనగర్లకు గంజాయిని రవాణా చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఇద్దరు స్మగ్లర్లపై  కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.