- 20 రోజులు నిఘా..11 మంది అరెస్ట్
సత్తుపల్లి, వెలుగు : గంజాయి రవాణా చేస్తున్న ముఠాను సత్తుపల్లిలో పోలీసులు 20 రోజులు నిఘా పెట్టి పట్టుకున్నారు. మంగళవారం 11 మంది నిందితులను అరెస్టు చేశారు. కేసు వివరాలను స్థానిక పోలీస్స్టేషన్లో ఏసీపీ రఘు, సీఐ కిరణ్ మీడియాకు వెల్లడించారు. ఆంధ్ర, ఒరిస్సా బోర్డర్ లోని గ్రామాల్లో నుంచి గంజాయిని కొనుగోలు చేస్తూ ఇతరులకు అమ్ముతున్నవారిపై సత్తుపల్లి పోలీసులు కొన్ని రోజులుగా స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈనెల6న పక్కా ఇన్ఫర్మేషన్తో మేడిశెట్టి వారిపాలెం క్రాస్ రోడ్ వద్ద పోలీసులు గంజాయి తరలిస్తున్న వ్యక్తులను పట్టుకొని విచారించారు.
ఈ క్రమంలో నిందితులైన సత్తుపల్లి పట్టణం ద్వారకాపురి కాలనీకి చెందిన కొమ్ము మనోవర్ధన్, ఆరుమళ్ల తరుణ్ కుమార్, కిష్టారం గ్రామానికి చెందిన పాశం వెంకట శివ రామకృష్ణ, కువ్వారపు దివాకర్, కువ్వారపు నితిన్ కుమార్, రామాల కార్తీక్, పాలకుర్తి రాజేశ్, నారాయణపురం గ్రామానికి చెందిన వేల్పుల పుల్లారావు, వెలిశాల వినయ్, తాళ్లమడకు చెందిన నున్నా నవీన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లా జనార్ధనవరం గ్రామానికి చెందిన కొత్తపల్లి రత్నబాబును పోలీసులు అరెస్టు చేశారు.
విచారణలో 82 మందికి గంజాయి అమ్ముతున్నట్లు ఒప్పుకోగా, అందులో11 మంది మైనర్లు ఉన్నట్లు తెలిసింది. నిందితుల నుంచి రూ.1.46 లక్షల విలువైన 5.8 కేజీల గంజాయి, ఒక కారు, 2 టూ వీలర్స్, 5 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. కేసును ఛేదించిన సీఐ కిరణ్ తో పాటు వెంసూరు ఎస్సై వీరప్రసాద్, సిబ్బందిని ఏసీపీ అభినందనందించారు.