- లారీ క్యాబిన్లో స్పెషల్ బాక్స్ఏర్పాటు చేసి తరలిస్తున్న డ్రైవర్ అరెస్ట్
- రూ.2 కోట్ల 25లక్షల విలువైన 710 కిలోల సరుకు సీజ్
హైదరాబాద్, వెలుగు : కమీషన్ మీద ఒడిశా నుంచి మహారాష్ట్రకు గంజాయిని తరలిస్తున్న కంటెయినర్ డ్రైవర్ ను మహేశ్వరం జోన్ ఎస్ వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.2 కోట్ల 25 లక్షల విలువైన 710 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను ఎస్ వోటీ డీసీపీ మురళీధర్‌తో కలిసి రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ సోమవారం వెల్లడించారు. రాజస్థాన్ లోని బేర్ జిల్లాకు చెందిన సుభాష్ బిష్ణోయ్(35) స్థానికంగా డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈజీ మనీ కోసం గంజాయి ట్రాన్స్ పోర్టుకు ప్లాన్ చేశాడు. స్థానిక గంజాయి సప్లయర్లతో పరిచయం పెంచుకున్నాడు.
ఒడిశా, ఏపీ నుంచి మహారాష్ట్రకు గంజాయిని ట్రాన్స్ పోర్టు చేసేవాడు. ఇందు కోసం తన కంటెయినర్ లారీ క్యాబిన్లో స్పెషల్ ఏర్పాటు చేసుకున్నాడు. గంజాయి ప్యాకెట్లను అందులో పెట్టి సీల్ చేసేవాడు. ఇలా ఒడిశా, ఏపీ నుంచి మహారాష్ట్రకు తరలించేవాడు. లారీ వెనుకభాగంలో ఎలాంటి సరుకు లోడ్ లేకుండానే వెల్ చేసేవాడు. ఇలా ఏజెన్సీ ఏరియాల నుంచి మహారాష్ట్రకు గంజాయిని తరలించేందుకు ఒక ట్రిప్పుకు రూ.60 వేల కమీషన్ తీసుకునేవాడు. గతంలో సుభాష్ బిష్ణోయ్ 500 కిలోల గంజాయిని ట్రాన్స్‌పోర్టు చేశాడు. లారీలో క్లీనర్ లేకుండా సుభాష్ ఒక్కడే గంజాయిని తరలించేవాడు.
గత మంగళవారం ఒడిశాలోని నవరంగ్‌పూర్ ఏజెన్సీకి వెళ్లిన సుభాష్.. 710 కిలోల గంజాయిని తీసుకుని దాన్ని లారీ క్యాబిన్‌లోని సీక్రెట్ బాక్స్‌లో దాచాడు. హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు ట్రావెల్ బయలుదేరాడు. గంజాయి ట్రాన్స్ పోర్టు గురించి సమాచారం అందుకున్న మహేశ్వరం జోన్ ఎస్ వోటీ పోలీసులు ఆదివారం సాయంత్రం ఘట్ కేసర్ సమీపంలోని ఔషాపూర్ చెక్ పోస్టు వద్ద సుభాష్ లారీని అడ్డుకున్నారు. లారీతో పాటు అందులో ఉన్న గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.
కొరియర్లో డ్రగ్స్ డెలివరీ..ఆరుగురు అరెస్ట్
రాజస్థాన్ నుంచి హెరాయిన్ సప్లయ్ చేస్తున్న గ్యాంగ్‌ను రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. కొరియర్ పార్సిల్స్, బైక్, క్యాబ్ సర్వీసెస్ ద్వారా డ్రగ్స్‌ను ట్రాన్స్‌పోర్ట్ చేస్తున్న ఇద్దరు మైనర్లు సహా నలుగురు సభ్యుల ముఠాను ఎల్‌బీనగర్ ఎస్‌వోటీ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. రూ.50 లక్షలు విలువ చేసే 80 గ్రాముల హెరాయిన్, బైక్, 4 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.ఈ గ్యాంగ్ వివరాలను రాచకొండ సీపీ డీఎస్ చౌహన్ సోమవారం వెల్లడించారు..