- సిటీ మీదుగా తరలిస్తున్న ఆరుగురి అరెస్ట్
- 227 కిలోల సరుకు స్వాధీనం
జీడిమెట్ల, వెలుగు : ఒడిశా నుంచి హైదరాబాద్ మీదుగా పుణెకు గంజాయిని తరలిస్తున్న ఆరుగురిని మేడ్చల్ ఎస్వోటీ, శామీర్‌పేట పోలీసులు అరెస్ట్ చేశారు. పేట్ బషీరాబాద్ పీఎస్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మేడ్చల్ డీసీపీ శబరీష్ వివరాలు వెల్లడించారు. పుణేకు చెందిన యోగేశ్ రాజాసింగ్ జాదవ్(29) మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. యోగిరాజ్ సంజయ్ హోట్కర్(23), దివాకర్ నారాలే(26) వ్యవసాయం చేసేవారు. చరణ్లాలా షిండే(31) సెంట్రింగ్ వర్కర్ కాగా.. చైతన్య తుషార్(19), రాహుల్ కాంతిలాల్ పటోలే(19) ఇద్దరూ స్టూడెంట్లు.
వీరంతా గ్యాంగ్‌గా ఏర్పడి ఈజీ మనీ కోసం ఒడిశా నుంచి గంజాయిని సేకరించి మహారాష్ట్రంలోని పుణెతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో అమ్మేవారు. ఈ గ్యాంగ్ ఇటీవల ఒడిశాకు చెందిన సంజు వద్ద 272 కిలోల గంజాయిని సేకరించింది. దాన్ని పుణెలో ఉండే అప్పా సోలంకి అందించేందుకు సిద్ధమైంది. రెండు వెహికల్స్‌లో గంజాయి ప్యాకెట్లతో పుణేకు బయలుదేరింది. సమాచారం అందుకున్న మేడ్చల్ ఎస్వోటీ, శామీర్‌పేట పోలీసులు ఓఆర్ఆర్ వద్ద తనిఖీలు చేపట్టారు.
వీరి కార్లను గుర్తించి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. 272 కిలోల గంజాయితో పాటు రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించారు. సప్లయర్ సంజు, కొనుగోలు దారుడు అప్పా సోలంకి పరారీలో ఉన్నట్లు డీసీపీ తెలిపారు.
శంకర్‌పల్లిలో 18 కిలోలు సీజ్
శంకర్పల్లి : ఇబ్రహీంబాగ్‌కు చెందిన రాజు సింగ్(37) గురువారం అర్ధరాత్రి సిటీ నుంచి రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లికి ఆటోలో గంజాయిని తరలిస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు మోకిల వద్ద అతడి ఆటోను అడ్డుకున్నారు. రూ.4 లక్షల విలువైన 18 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆటోను సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు. రాజు సింగ్ ను రిమాండ్‌కు పంపినట్లు పోలీసులు తెలిపారు.