గతంలో మావోయిస్టు... ఇప్పుడు గంజాయి స్మగ్లర్..

 గతంలో మావోయిస్టు... ఇప్పుడు గంజాయి స్మగ్లర్..
  • ఎల్బీనగర్​లో నిందితుడి అరెస్ట్
  • అతడితోపాటు మరో ఇద్దరు  

ఎల్బీనగర్, వెలుగు: ఎల్బీనగర్​లో హాష్ ఆయిల్ సరఫరా చేస్తున్న మాజీ మావోయిస్టుతోపాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీలోని విశాఖ జిల్లాకు చెందిన వంతల నారాయణ అలియాస్ సిద్ధు (24) గతంలో మావోయిస్టుగా పనిచేశాడు. 2021లో పోలీసుల ఎదుట లొంగిపోయారు. అనంతరం సులువుగా డబ్బులు సంపాదించడానికి విశాఖ టు హైదరాబాద్​కు గంజాయి దందాను మొదలుపెట్టాడు. 

ఈ క్రమంలోనే అదే ప్రాంతానికి చెందిన వంతల రమేశ్, (19), అర్జున్ (19), శివ, కిషోర్​తోపాటు ఎల్బీనగర్​కు చెందిన రాహుల్​తో కలిసి ఒక గ్యాంగ్​ను ఏర్పాటు చేశాడు. వీరు విశాఖ ఏజెన్సీ నుంచి హాష్ ఆయిల్ తీసుకొచ్చి, సిటీలో అమ్ముతున్నారు. మంగళవారం రాత్రి ఎల్బీనగర్ మాల్ మైసమ్మ ఫ్లైఓవర్ వద్ద రాహుల్​కు హాష్ ఆయిల్ ఇవ్వడానికి వచ్చిన సిద్ధు, రమేశ్, అర్జున్​ను ఎల్బీనగర్ పోలీసులు పక్కా సమాచారంతో అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 1.10 కిలోల హాష్ ఆయిల్, మూడు సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో రాహుల్​తో పాటు శివ,కిషోర్​ పరారీలో ఉన్నారని, వారిని త్వరలో పట్టుకుంటామని సీఐ వినోద్ కుమార్ తెలిపారు. 

రైల్వే స్టేషన్​లో 10 కిలోల గంజాయి లభ్యం

సికింద్రాబాద్: సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​లో 10 కిలోల గంజాయి లభ్యమైంది. రైల్వే పోలీసులు సాధారణ తనిఖీల్లో భాగంగా బుధవారం ప్లాట్​ఫారం 10 వద్ద ఒక బ్యాగ్​ను గుర్తించారు. దానిని తెరిచి చూడగా, అందులో 10 కిలోల గంజాయి లభ్యమైంది. వీటి విలువ దాదాపు రూ.2.60 లక్షల వరకు ఉంటుందని రైల్వే పోలీసులు తెలిపారు. ఈ బ్యాగును అక్కడ ఎవరు పెట్టారు? ఎలా వచ్చింది? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. 

బాలానగర్​లో ఒకరు అరెస్ట్

హైదరాబాద్ సిటీ: బాలానగర్​లో బైక్​పై గంజాయి సరఫరా చేస్తున్న వ్యక్తిని పక్కా సమాచారంతో మేడ్చల్ డీటీఎఫ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని బేగం బజార్​కు చెందిన యోగేశ్ యాదవ్​గా గుర్తించారు. అతడి నుంచి 1.50 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.