గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్.. ఏ కేసులో అంటే..

విజయవాడ: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో వంశీ నిందితుడిగా ఉన్నారు. అరెస్ట్ అనంతరం ఆయనను గన్నవరం పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ కేసులో ఇప్పటికే 18 మందిని అరెస్ట్ చేశారు. వంశీ అరెస్ట్తో గన్నవరంలోని ఆయన ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వంశీ అనుచరులు, వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయన ఇంటి వద్దకు చేరుకుని తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ కేసు పూర్వాపరాలేంటంటే.. ఈ ఏడాది ఫిబ్రవరి 20న గన్నవరం టీడీపీ కార్యాలయంపై అప్పటి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు, వైసీపీ నాయకులు దాడి చేసి నిప్పుబెట్టారు. గన్నవరం టీడీపీ కార్యాలయం ఆపరేటర్ ముదునూరి సత్యవర్ధన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఐపీసీ సెక్షన్ 143, 147, 148, 435, 506 రెడ్విత్ 149, 3(1) (ఎస్సీ, ఎస్టీ చట్టం) కింద కేసు నమోదు చేశారు. కార్యాలయ ఫర్నిచర్ను ధ్వంసం చేసి అక్కడే ఉన్న కొందరు టీడీపీ నేతలను గాయపరిచి వాహనాలను తగులబెట్టినట్టుగా వంశీ అనుచరులపై కేసు నమోదైంది. వంశీ అనుచరులు గానీ, వైసీపీ కార్యకర్తలు గానీ.. మొత్తం మీద 71 మంది ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. సీసీ కెమెరాలు, వీడియోల ద్వారా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.