![హైదరాబాద్లో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్](https://static.v6velugu.com/uploads/2025/02/gannavaram-ex-mla-vallabhaneni-vamsi-arrested-in-hyderabad_Pqdi8FVsTY.jpg)
హైదరాబాద్: ఏపీలోని కృష్ణా జిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ మోహన్ను గురువారం ఉదయం హైదరాబాద్లో ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను హైదరాబాద్లో అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలిస్తున్నారు. గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఆయనను అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఈ కేసులో వంశీ నిందితుడిగా ఉన్నారు. 2024 ఫిబ్రవరి 20న గన్నవరం టీడీపీ కార్యాలయంపై అప్పడు గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్న వల్లభనేని వంశీ అనుచరులు, వైసీపీ నాయకులు దాడి చేసి నిప్పుబెట్టారు.
గన్నవరం టీడీపీ కార్యాలయం ఆపరేటర్ ముదునూరి సత్యవర్ధన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఐపీసీ సెక్షన్ 143, 147, 148, 435, 506 రెడ్విత్ 149, 3(1) (ఎస్సీ, ఎస్టీ చట్టం) కింద కేసు నమోదు చేశారు. కార్యాలయ ఫర్నిచర్ను ధ్వంసం చేసి అక్కడే ఉన్న కొందరు టీడీపీ నేతలను గాయపరిచి వాహనాలను తగులబెట్టినట్టుగా వంశీ అనుచరులపై కేసు నమోదైంది. వంశీ అనుచరులు గానీ, వైసీపీ కార్యకర్తలు గానీ.. మొత్తం మీద 71 మంది ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. సీసీ కెమెరాలు, వీడియోల ద్వారా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో కుట్ర కోణం ఉందని, గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి వెనుక వంశీ పాత్ర ఉందని ఆయనను నిందితుడిగా చేర్చారు.