కరీంనగర్ జిల్లా గన్నేరువరంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించేందుకు వచ్చిన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ను స్థానికులు అడ్డుకున్నారు. గుండ్లపల్లి నుంచి గన్నేరువరం దాకా డబుల్ రోడ్డు నిర్మాణంపై నిలదీశారు.దీనిపై ఎమ్మెల్యే రసమయి నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా గ్రామస్థులు వినలేదు. దీంతో ఎమ్మెల్యే రసమయి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు.
నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకుండా మునుగోడులో అభివృద్ధి చేస్తామని హామీ ఇవ్వడం ఏంటని స్థానికులు ఎమ్మెల్యేను నిలదీశారు. డబుల్ రోడ్డు నిర్మాణం గురించి వాట్సాప్ గ్రూప్లలో ఇన్ఫర్మేషన్ను షేర్ చేసిన నాగరాజు అనే యువకున్నీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని మండిపడ్డారు. వెంటనే అతన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
కరీంనగర్ జిల్లా మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పై తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి (సీఈసీ) వికాస్ రాజ్ కు సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇటీవల ఫిర్యాదు చేశారు. మానకొండూరు నియోజకవర్గానికి చెందిన రూ.2 కోట్ల నిధులను మునుగోడులో ఖర్చు చేసి అభివృద్ధి చేస్తానంటూ రసమయి ఇచ్చిన హామీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
గత నెల 20న మునుగోడు నియోజకవర్గంలోని చండూరు మండలం దోనిపాముల గ్రామంలో జరిగిన ధూంధాంలో తన నియోజకవర్గ నిధులను దోనిపాముల కోసం వెచ్చిస్తానంటూ రసమయి హామీ ఇచ్చారని రాజశేఖర్ రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధమైన ఈ హామీపై స్పందించి రసమయిపై చర్యలు తీసుకోవాలని కోరారు.