నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: నాగర్ కర్నూల్ పట్టణంలోని కల్లు దుకాణంలో కల్తీ కల్లు తాగి తెలకపల్లి మండలం గొడ్డంపల్లి గ్రామానికి చెందిన గన్నోజి విష్ణుమూర్తి(75) చనిపోయాడు. సోమవారం మధ్యాహ్నం రాంనగర్ కాలనీలోని కల్లు దుకాణంలో తన తండ్రి చనిపోయినట్లు ఫోన్ వచ్చిందని మృతుడి కుమారుడు జగదీశ్ తెలిపాడు. అక్కడికి వెళ్లే సరికి కల్లు దుకాణానికి తాళం వేసి వెళ్లిపోయారని వాపోయాడు. గతంలో కూడా కల్లు తాగి అనారోగ్యం పాలవడంతో హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స చేయించి ఇంటికి తీసుకొచ్చామన్నాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.
వాగు లో పడి మహిళ..
మదనాపురం, వెలుగు: మండలంలోని దుప్పల్లి ఊకశెట్టి వాగులో పడి గొడుగు నారమ్మ(45) చనిపోయినట్లు ఎస్ఐమురళి తెలిపారు. పశువులు ఊకశెట్టి వాగులో నీళ్లు తాగుతుండగా, వాటిని బయటికి తోలేందుకు నారమ్మ నీటి గుంతలోకి దిగింది. ఈత రాకపోవడంతో నీటిలో మునిగి పోతుండగా, అక్కడే ఉన్న పశువుల కాపరులు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ఆమెను బయటికి తెచ్చి ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. భర్త లక్ష్మన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
గుండె పోటుతో ఉపాధి కూలీ..
అచ్చంపేట, వెలుగు: బల్మూర్ మండలం గోదల్ గ్రామానికి చెందిన బొడ్డుపల్లి వెంకటయ్య(45) సోమవారం ఉపాధి హామీ పనులకు వెళ్లాడు. పని చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలి చనిపోయాడు. మృతుడి కుటుంబాన్ని ఎంపీడీవో దేవన్న, ఏపీడీ శ్రీనివాసులు, ఏపీవో సువర్ణ పరామర్శించారు. ప్రభుత్వం నుంచి బాధిత కుటుంబాన్ని అదుకునేలా ఉన్నతాధికారులకు నివేదిక పంపుతామని చెప్పారు. బాధిత కుటుంబానికి గ్రామస్తుడు జగదీశ్వర్‌రెడ్డి రూ.10 వేల ఆర్థికసాయం అందజేశారు. మృతుడికి భార్య రజిత, కూతురు నాగలక్ష్మి, కుమారుడు నాగరాజు ఉన్నారు.