బీజేపీలో లుకలుకలు.. ఎమ్మెల్యేలు, రాష్ట్ర నాయకత్వం మధ్య గ్యాప్

బీజేపీలో లుకలుకలు..  ఎమ్మెల్యేలు, రాష్ట్ర నాయకత్వం మధ్య గ్యాప్
  • పార్టీ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలను ఇన్వాల్వ్ చేయని నేతలు 
  • స్టేట్ ఆఫీసులో కనీసం ఎల్పీ నేతకు కూడా రూమ్ అలాట్ చేయని వైనం 
  • రాష్ట్ర నేతల మధ్య గ్యాప్​ను సరిచేయని పార్టీ అధిష్టానం 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర బీజేపీలో మళ్లీ లుకలుకలు మొదలయ్యాయి. ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వానికి, ఎమ్మెల్యేలకు గ్యాప్ మరింత పెరుగుతోంది. పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలను పార్టీ కార్యక్రమాల్లో ఇవ్వాల్వ్ చేయడం లేదు. దీంతో ఎమ్మెల్యేలు కూడా పార్టీ మీటింగ్​లకు దూరంగా ఉంటున్నారు. అయితే, ఈ గ్యాప్​ను సరిచేయాల్సిన ఢిల్లీ పెద్దలు కూడా పెద్దగా పట్టించుకోకపోవడంపై నేతల్లోనూ అయోమయం నెలకొన్నది. 

గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున 8 మంది ఎమ్మెల్యేలు విజయం సాధించిన విషయం తెలిసిందే. అందులో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాత్రమే గతంలో ఎమ్మెల్యేలుగా గెలవగా, మిగిలిన ఆరుగురు కొత్తగా అసెంబ్లీలోకి వచ్చారు. వారందరినీ పార్టీ కార్యక్రమాల్లో ఎక్కువగా ఉపయోగించుకోవాల్సిన కమలం నేతలు.. పెద్దగా పట్టించుకోవడం లేదు. 

రాష్ట్రస్థాయిలో జరుగుతున్న వివిధ మోర్చాల ఆందోళనల్లో మాజీ నేతలు పాల్గొంటున్నా.. కొత్తగా ఎన్నికైన వారిని మాత్రం పిలవడం లేదనే విమర్శలు ఉన్నాయి. కాగా, ప్రస్తుతం ప్రతిపక్షంలో కొనసాగుతున్న బీజేపీ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావాలనే భావనతో ఉంది. కానీ, ఎమ్మెల్యేలను ప్రోగ్రామ్స్ లో ఇన్వాల్వ్ చేయకుండా ముందుకు పోతే.. పార్టీని ప్రజల్లోకి ఎలా వేగంగా తీసుకుపోగలమని కొందరు సీనియర్ నేతలు ప్రశ్నిస్తున్నారు. 

ఇటీవల బీజేపీ స్టేట్ ఆఫీసులో కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి రైతు రుణమాఫీ హెల్ప్ లైన్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలకు కనీస సమాచారం కూడా ఇవ్వకపోవడంపై వారంతా గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. పార్టీ బ్యానర్లు, పోస్టర్లలోనూ కేవలం కిషన్ రెడ్డి ఫొటో తప్ప.. బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీల ఫొటోలు వేయడం లేదనే విమర్శలూ ఉన్నాయి. మరోపక్క బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డిని కూడా పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా ఇన్వాల్వ్ చేయడం లేదని, పాల్గొన్న ప్రోగ్సామ్ ల్లోనూ ఆయనకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదనే వాదనలున్నాయి. 

అసెంబ్లీ సమావేశాల ముందూ దిశానిర్దేశం చేయని స్టేట్ ప్రెసిడెంట్.. 

గత నెల 23 నుంచి ఈ నెల 2 వరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరిగాయి. సాధారణంగా సమావేశాల ముందు ఆ పార్టీ ఎమ్మెల్యేలతో రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడి.. అసెంబ్లీలో ఎలా వ్యవహరించాలనే దానిపై దిశానిర్దేశం చేస్తుంటారు. కానీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాత్రం కమలం పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం కాకపోవడంతో ఆ పార్టీలో పెద్ద చర్చకు దారి తీసింది. అయితే, ఆయన కేంద్రమంత్రి హోదాలో ఉండడంతో పాటు కేంద్ర బడ్జెట్ సమావేశాలు జరుగుతుండడంతోనే సమావేశం పెట్టలేదని పార్టీ నేతలు కొందరు చెప్తున్నారు. 

కాగా, బడ్జెట్ లో వివిధ పద్దులపైనా, కేంద్రం ఇచ్చే నిధులపైనా చర్చ జరిగింది. అయితే, కేంద్రం నిధులు ఇవ్వడం లేదని రాష్ట్ర ప్రభుత్వం విమర్శలు చేసినా.. దాన్ని సరైన పద్ధతిలో కమలం ఎమ్మెల్యేలు తిప్పికొట్టలేక పోయారని ఆ పార్టీ నేతల్లో అసంతృప్తి ఉంది. దీనికి రాష్ట్ర పార్టీ నేతలు ఎమ్మెల్యేలకు సరైన సమాచారం ఇవ్వకపోవడమే కారణమని తెలుస్తోంది. 

స్టేట్ ఆఫీసులో ఇతరుల రూమ్​లలోనే ఎమ్మెల్యేలు..

బీజేపీ తరఫున 8 మంది ఎమ్మెల్యేలుగా గెలువగా.. వారిలో రాజాసింగ్ మినహా మిగిలిన వారంతా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ కు చెందిన వారే. ఎమ్మెల్యేలెవ్వరికీ స్టేట్ బీజేపీ ఆఫీసులో ఒక్కరూము కూడా అలాట్ చేయలేదు. కనీసం బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డికీ రూమ్ ఇవ్వలేదు. దీంతో స్టేట్ ఆఫీసుకు వచ్చినప్పుడు ఇతరులకు కేటాయించిన రూముల్లో ఉండాల్సిన పరిస్థితి వస్తోందని ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్టేట్ ఆఫీసులో రాష్ట్ర అధ్యక్షుడితో పాటు ప్రధాన కార్యదర్శులకు, మోర్చాలకు, జాతీయ నేతలకు మాత్రమే రూములు ఇచ్చారు.

 కానీ, పార్టీ తరఫున ఎల్పీ నేతకు కూడా రూమ్ అలాట్ చేయకపోవడంపైన పార్టీ నేతలే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అయితే, రెండు రోజుల క్రితం జరిగిన బీజేపీ రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ సమావేశానికి ఎమ్మెల్యేలకు ఆహ్వానం అందించారు. కానీ, కేవలం నిజామాబాద్ ఎమ్మెల్యే మాత్రమే అటెండ్ కాగా, మిగిలిన ఏడుగురు డుమ్మా కొట్టారు. దీంతో మరోసారి ఎమ్మెల్యేలు, పార్టీ నేతల మధ్య గ్యాప్ బయటపడినట్టు అయింది. ఇప్పటికైనా కేంద్ర అధిష్టానం ఈ గ్యాప్ ను తగ్గించకపోతే, పార్టీలో గ్రూపులు పెరిగే అవకాశముందన్న చర్చ కమలం నేతల్లో నడుస్తోంది.