అనుచరుల హల్​చల్​ : జనానికీ.. ఎమ్మెల్యేలకూ మధ్య గ్యాప్​

నల్గొండ, వెలుగు : బీఆర్​ఎస్ ఎమ్మెల్యేల అనుచరులు కొందరు అన్నీతామే అన్నట్టుగా వ్యవహారిస్తున్న తీరు ప్రజలను, ప్రజాప్రతినిధులను, పార్టీలోని కొందరి నేతలను ఇబ్బందులకు గురి చేస్తోంది.  దీంతో ఇటు ప్రజలు, అటు పార్టీ కేడర్​ దూరమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాల్లో వాళ్లదే హవా నడుస్తోంది. పొద్దన్నే క్యాంపు ఆఫీసుల వద్ద వేచి ఉండే జనాల గురించి పట్టించుకోవడం మానేసి అనుచరులతోనే ఎమ్మెల్యేల సమయం వృథా అవుతోంది. నియోజకవర్గంలో ఓటర్లను సైతం ప్రభావితం చేయలేని ఇలాంటి లీడర్లు నిత్యం ఎమ్మెల్యేలను అంటిపెట్టుకుని ఉండటం వల్ల ఏ సమస్య కూడా నేరుగా ఎమ్మెల్యేల వద్దకు చేరకుండా పోతోంది. అక్కడికి వచ్చిన జనానికి, పార్టీ కేడర్​కు ఎమ్మెల్యే బిజీగా ఉన్నాడనో, అర్జంట్​ పనిమీద బయటకు వెళ్లిపోతున్నాడనో చెప్పి వారిని కలవకుండా చేస్తున్నారు. 

ఈ పరిస్థితితో నల్గొండ జిల్లాలో ఓ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో అడుగుపెట్టిన సందర్బాలు చాలా తక్కువనే చెప్పాలి. లక్షలు ఖర్చు పెట్టి కట్టించిన క్యాంపు ఆఫీసుల్లో ఉండేందుకు ఇష్టపడని కొందరు ఎమ్మెల్యేలు ఇంటి నుంచి తమ కార్యకలపాలు కొనసాగిస్తున్నారు. ఇంకొందరు క్యాంపు ఆఫీసులను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకున్నారు. పీఏలు, పీఆర్వోలు, గన్​మెన్లు, కారుడ్రై వర్లు అన్నీ వసతులు కల్పించారు. కానీ అక్కడకు వచ్చిన ప్రజల గోడు గురించి మాత్రం పట్టించుకోవడం లేదు. అదే ఎమ్మెల్యేల అనుచరులకు, వారి మనుషులకు ఎక్కడా చెకింగ్​లు ఉండవు. నేరుగా ఎంట్రీ​ దొరుకుతుంది.   ఇదిలా ఉండగా ఎమ్మెల్యేలు ఎక్కడికి పోతున్నారనే సమాచారం వారు ముందుగానే తెలుసుకోవడం, అక్కడి నాయకులు చేస్తున్న ఏర్పాట్లలో తలదూర్చడం, ఎమ్మెల్యే పేరు చెప్పి ఆర్డర్లు వేయడం చేస్తున్నారు. 

పైరవీలు ఎక్కువే

..
ఎమ్మెల్యేలను అడ్డంపెట్టుకుని కొందరు అనుచరులు జోరుగా పైరవీలూ చేస్తున్నారు. పోలీసులకు, తహసీల్దార్లకు, సబ్ రిజిస్ట్రార్లకు, మున్సిపల్​ ఆఫీసులు, కాంట్రాక్టర్లకు వారు ఒక ఫోన్ కాల్​ చేస్తే సరి.. పని సులువుగా అయిపోయే విధంగా ప్రస్తుత పరిస్థితి ఉంది. దీంతో ఎమ్మెల్యేల చుట్టూ తిరిగి విసిగిపోయిన జనాలు, సెకండ్​ కేడర్​ నాయకులు తప్పని పరిస్థితుల్లో అనుచరులనే ఆశ్రయించాల్సి వస్తోంది.  దీనిని అదునుగా తీసుకొని వారు ఎమ్మెల్యేల పేరును ఇష్టం వచ్చినట్లు వాడుకుంటున్నారు. ఈ వైఖరి పార్టీతోపాటు ఎమ్మెల్యేల వ్యక్తిగత ఇమేజ్​ ను దెబ్బతీస్తుందని కొందరు పార్టీ సీనియర్లు లీడర్లే  హెచ్చరిస్తున్నారు.

నల్గొండ జిల్లాలోని ఓ ఎమ్మెల్యేకు జాతకాలు, ముహూర్తాల మీద నమ్మకం ఎక్కువ. ఉదయం శుభగడియలు వచ్చాకే ఇంటి నుంచి బయలుదేరుతాడు. ముహూర్తం మేరకే ఏ కార్యక్రమమైనా మొదలు పెడ్తడు. ఇది ఓ రకంగా ఆయన రాజకీయ ఎదుగుదలకు కలిసొస్తుంది. కానీ తెల్లారేసరికి మాత్రం ఆ ఎమ్మెల్యే ఇంటి ముందల అనుచరులు చేసే హల్​చల్ మామూలుగా ఉండడం లేదు. ఎమ్మెల్యేను కలిసేందుకు ప్రజలు, పార్టీ లీడర్లు వస్తే వారు కలువనివ్వరు. వచ్చిన పని ఏంటనీ కూపీ లాగడం, దాన్నే అవకాశంగా తీసుకుని బయటకు లీక్​లు ఇవ్వడం వాళ్లకు అలవాటుగా మారిపోయింది. అధికారిక, అనధికారిక కార్యక్రమాల్లోనూ వాళ్లదే హవా కొనసాగుతోంది. పొద్దున్నుంచి అర్ధరాత్రి వరకు ఎమ్మెల్యేనే అంటిపెట్టుకుని ఉండటం పార్టీ నాయకులకు ఇబ్బందికరంగా మారింది.  

ఓ యువ ఎమ్మెల్యే వెంట నిత్యం ఓ గ్యాంగ్​ చక్కర్లు కొడుతోంది. ఫలానా ఊళ్లోకి ఎమ్మెల్యే వస్తుండని తెలిస్తే చాలు.. ఆ బ్యాచ్​ చేసే హంగామా అంతాఇంతా కాదు. దీనివల్ల  సీనియర్​ నాయకులు, జనాలు, ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే వద్దకు పోలేని పరిస్థితి.  అన్నీ కార్యక్రమాల్లో వారు తప్ప మరెవ్వరూ కనిపించడం లేదు. సభల్లో, సమావేశాల్లో ఎప్పుడూ వారు ఎమ్మెల్యేను పొగడ్తలతో ముంచెత్తుతూ  కేకలు పెట్టడం చికాకు తెప్పిస్తున్నాయని సీనియర్ నాయకులే అంటున్నరు. పనిమీదొచ్చిన సామాన్య జనానికి వాళ్ల మొఖం మీదనే పని కాదని ఎమ్మెల్యే చెప్పడం కొత్త సమస్యలు తెచ్చిపెడ్తోందని హెచ్చరిస్తున్నరు.