- పర్మినెంట్ స్థలం లేకపోవడంతో ఎక్కడి చెత్త అక్కడే..
- గతంలో సుందిళ్లలో డంపింగ్‌కు గ్రామస్తుల అభ్యంతరం
- తాజాగా ఆర్ఎఫ్‌సీఎల్ సమీపంలో చెత్త పారబోసేందుకు అధికారుల అడ్డు
- శాశ్వత డంపింగ్ యార్డుకు పట్టణవాసుల డిమాండ్
గోదావరిఖని, వెలుగు: రామగుండం కార్పొరేషన్‌లో చెత్త డంపింగ్ సమస్య వెంటాడుతోంది. పట్టణంలో డివిజన్ల నుంచి సేకరించిన చెత్త పారబోయడానికి పర్మినెంట్ స్థలం లేకపోవడంతో ఎక్కడిపడితే అక్కడ డంప్ చేస్తున్నారు. ఆర్నెళ్ల కింద సుందిళ్ల గ్రామం వద్ద సింగరేణి స్థలంలో చెత్తను డంప్ చేయగా గ్రామస్తులు అడ్డుకున్నారు.
తాజాగా ఆర్ఎఫ్‌సీఎల్‌కు చెందిన గోదావరి ఒడ్డున గల ఫిల్టర్‌బెడ్ ఏరియాలో చెత్త పారబోస్తుండగా ఆ సంస్థ ఆఫీసర్లు అభ్యంతరం తెలుపుతూ ఏకంగా బోర్డు పాతారు. దీంతో చెత్తను ఎక్కడ డంప్ చేయాలో బల్దియా సిబ్బందికి అర్థంకావడం లేదు. తాత్కాలికంగా గంగానగర్‌లోని ఖాళీ ప్రదేశంలో డంప్ చేస్తుండగా.. పర్మినెంట్స్థలం కేటాయించాలని టౌన్‌వాసులు కోరుతున్నారు.
మొదట్లో జల్లారం శివారులో డంపింగ్..
రామగుండం కార్పొరేషన్ పరిధిలో సేకరించిన చెత్తను గతంలో జల్లారం– సింగిరెడ్డిపల్లి గ్రామ శివారులోని ఖాళీ ప్రదేశంలో చెత్తను పారబోసేది. కొన్నేండ్లపాటు ఈ ప్రక్రియ కొనసాగింది. కాగా జీడీకే 11వ గనిని విస్తరించేందుకు జల్లారం, సింగిరెడ్డిపల్లి వద్ద చెత్త డంప్చేయొద్దని సింగరేణి ఆఫీసర్లు బల్దియాకు సూచించారు. దీంతో అక్కడ బంద్ అయింది. ఆ తర్వాత గోదావరి నది ఒడ్డున సమ్మక్క సారలమ్మ జాతర స్థలంలో డంప్ చేశారు. అయితే ఈ చెత్తను కాలబెట్టడంతో వచ్చే పొగ చుట్టుపక్కల వారిని ఉక్కిరిబిక్కిరి చేసింది. స్థానికులతో పాటు సమ్మక్క–సారలమ్మ జాతర కమిటీ, విశ్వహిందూ పరిషత్, ఇతర సంస్థల ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో అక్కడా చెత్త డంపింగ్‌ను నిలిపివేశారు.
సుందిళ్ల వద్ద కూడా ఇదే పరిస్థితి...
రామగుండం బల్దియా చెత్త సమస్యతో ఇబ్బంది పడుతుండగా కలెక్టర్ ఆదేశాల మేరకు సుందిళ్ల గ్రామ సమీపంలో డంపింగ్‌యార్డు కోసం సింగరేణి సంస్థ ఆరు నెలల కింద ఐదెకరాలు కేటాయించింది. స్థలాన్ని చదును చేసి డంప్ చేస్తుండగా సుందిళ్ల గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకించారు. చెత్తను తరలించే వెహికిల్స్‌ను అడ్డుకుని నిరసన తెలిపారు. దీంతో ఇక్కడ కూడా చెత్తను డంప్ చేయడం మానుకున్నారు.
దీంతో బల్దియాకు డంపింగ్ సమస్య తలనొప్పిగా మారింది. దీంతో చివరకు గోదావరి నది సమీపంలో ఉపయోగంలో లేని ఆర్ఎఫ్‌సీఎల్‌కు చెందిన ఫిల్టర్‌బెడ్ వద్ద గల ఖాళీ స్థలంలో డంపింగ్ చేస్తున్నారు. ఐదు నెలలుగా ఈ ప్రక్రియ కొనసాగుతుండగా ఇటీవల తమ స్థలాలను గుర్తించే క్రమంలో ఫిల్టర్ బెడ్ స్థలంలో చెత్త పారబోస్తున్నట్టు ఆర్ఎఫ్‌సీఎల్ ఆఫీసర్లు గ్రహించారు. వెంటనే తమ స్థలంలో డంపింగ్ చేయొద్దంటూ బోర్డులు పాతి చెత్తవాహనాలు రాకుండా బండరాళ్లను అడ్డుగా పెట్టారు. దీంతో డంపింగ్ సమస్య మళ్లీ మొదటికొచ్చింది.
ప్రస్తుతం గోదావరిఖని గంగానగర్ సమీపంలో తాత్కాలికంగా డంప్ చేస్తున్నారు. వాస్తవంగా రామగుండం కార్పొరేషన్ పరిధిలో డంపింగ్ యార్డు ఏర్పాటుకు కనీసం 30 ఎకరాలు అవసరమని బల్దియా అధికారులు చెబుతున్నారు. ఈ స్థలాన్ని సింగరేణి లేదా ఎన్టీపీసీల ద్వారా కేటాయింపచేసి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే చొరవ చూపాలని స్థానికులు కోరుతున్నారు.