- కుండీలను తీసేసిన జీహెచ్ఎంసీ
- వరుస సెలవులతో రోడ్లపైనే పేరుకు పోతున్న కచరా
- స్వచ్ఛ ర్యాంకుల్లో అట్టడుగున సిటీ
- డెంగీ, వైరల్ ఫీవర్ల బారిన జనం
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌లో పారిశుధ్యం పడకేసింది. కాలనీలు, బస్తీలు కంపుకొడుతున్నాయి. ప్రధాన రహదారులపైనా చెత్త ఎక్కడికక్కడే పేరుకుపోయింది. వరుసగా సెలవులు ఉండటంతో గార్బేజ్ తరలింపు విషయాన్ని బల్దియా పెద్దగా పట్టించుకోలేదు. దీంతో సిటీ అంతటా పరిస్థితి ఇలాగే ఉంది. కొన్ని ప్రాంతాల్లోనైతే వారం రోజులైనా చెత్త తొలగించలేదని జనం చెబుతున్నారు. ప్రస్తుతం వైరల్ ఫీవర్స్ ఎక్కువవుతుండటంతో ఆందోళనకు గురవుతున్నారు. చెత్త వల్ల ఈగలు, దోమల బెడద ఎక్కువై డెంగీ, వైరల్ ఫీవర్లు పెరుగుతున్నాయి.
స్వచ్ఛ ఆటోలు వస్తలే
‘డస్ట్ బిన్ లెస్ సిటీ’ పేరుతో ఆరు నెలల కిందట గ్రేటర్ అంతటా చెత్త కుండీలను తొలగించిన జీహెచ్ఎంసీ.. తర్వాత చెత్త సేకరణపై పెద్దగా దృష్టి పెట్టలేదు. కోటికిపైగా జనాభా ఉన్న సిటీలో ఇంటింటికీ వెళ్లి చెత్త తీసుకెళ్లేందుకు 2,800 స్వచ్ఛ ఆటోలు మాత్రమే ఉన్నాయి.
అందులోనూ 500కుపైగా ఆటోలు ఫీల్డ్‌లోకి రావడంలేదు. ‘ఓనర్ కమ్ డ్రైవర్ స్కీమ్’ కింద స్వచ్ఛ ఆటోలు అందుకున్న కొందరు.. ఆటోలను తీసుకొని పత్తాలేకుండా పోయారు. మరికొందరు సొంత పనులకు వినియోగించుకుంటున్నారు. దీంతో చెత్త సేకరణకు చాలా ప్రాంతాల్లో ఆటోలు రావడంలేదు. కొన్ని ప్రాంతాల్లో టైమ్‌కి ఆటోలు రావడం లేదని, దీంతో చెత్త వేయలేకపోతున్నామని, ఇంటి దగ్గర పెడితే తీసుకెళ్లడంలేదని, బయటపెడితే కుక్కలు చెల్లాచెదురు చేస్తున్నాయని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేరే దారి లేక గతంలో డస్ట్ బిన్లు ఉండే ప్రాంతాల్లోనే జనం చెత్త వేస్తున్నారు. అది కాస్తా రోడ్లపైకి చేరుతోంది.
కోట్లలో ఖర్చు.. కానీ..
చెత్త తరలించేందుకు గతంలో కన్నా ఎక్కువగానే జీహెచ్ఎంసీ ఖర్చు చేస్తోంది. 2016 వరకు ఏడాదికి రూ.160 కోట్లను ఖర్చు చేసేది. ఆ తర్వాత నుంచి ఏజెన్సీల ద్వారా నిర్వహిస్తూ.. ఏటా రూ.660 కోట్ల వరకు ఖర్చు చేస్తోంది. గతంలో జీహెచ్ఎంసీకి సొంతంగా 800 గార్బేజ్ వెహికల్స్ ఉండేవి. వీటి ద్వారా చెత్తను డంపింగ్ యార్డులకు తరలించేది. 15 ఏండ్ల సర్వీసు దాటిందనే కారణంతో 600 గార్బేజ్ వెహికల్స్‌ను జీహెచ్‌ఎంసీ పక్కనపెట్టింది. ప్రస్తుతం 200 వెహికల్స్ మాత్రమే చెత్త తరలిస్తున్నాయి. గతంతో పోలిస్తే రూ.460 కోట్ల ఖర్చు పెరిగినా.. సమస్య మాత్రం పరిష్కారం కాలేదు.
ర్యాంక్ రావట్లే
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో హైదరాబాద్‌కు మంచి ర్యాంక్ దక్కడంలేదు. 2015 నుంచి 20వ స్థానంలోనే ఉంటోంది. 2016లో మాత్రమే 19 ర్యాంక్ సాధించింది. సిటీ క్లీన్‌గా లేకపోవడంతోనే సర్వేలో మంచి ర్యాంక్ రావడం లేదని తెలిసినా అధికారులు పట్టించుకోలేదు. జీహెచ్ఎంసీ కూడా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు.
వారం రోజులైతంది..
రోడ్డుపై ఎక్కడ చూసినా చెత్త. వారం రోజులుగా ఎత్తడం లేదు. కంపు భరించలేక కిటికీలు, తలుపులు మూసుకుని ఇండ్లలో ఉంటున్నం. రోగాలు వస్తయని భయమైతంది. ఇప్పటికైనా అధికారులు స్పందించాలె. ఎప్పటికప్పుడు చెత్తను తరలించాలె.
- సంతోశ్, వెస్ట్ మారేడ్‌పల్లి
ముక్కు మూసుకుని పోతున్న
రోడ్డు పక్కన జనం వేస్తున్న చెత్తను 10 రోజులకు ఓసారి తీస్తున్నారు. చెత్త కుప్ప పేరుకుపోయినా ఎవరూ పట్టించుకుంటలే. అటువైపు వెళ్తే ముక్కు మూసుకోని పోవాల్సి వస్తోంది. ఇక్కడ చెత్త వేయకుండా అధికారులు చర్యలు తీసుకోవాలె.
- సుబ్రమణ్యం, కంచన్‌బాగ్
ఫిర్యాదిచ్చినా పట్టించుకుంటలే
చెత్త కుండీలను తీసేయడంతో జనం రోడ్డుపైనే చెత్త వేస్తున్నారు. వారానికి రెండు సార్లు మాత్రమే క్లీన్ చేస్తున్నారు. రోడ్లపై కంపు కొడుతోంది. ఈగలు, దోమలు ఎక్కువైతున్నయి. ఇప్పటికే ఇక్కడ చాలా మంది జ్వరాలతో బాధపడుతున్నారు. చెత్త తీయడం లేదని అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించడంలేదు.
- కుద్దుస్, రియాసత్ నగర్
ఆల్టర్నేట్ చర్యలు చేపట్టాలె
ఆల్టర్నేట్ చర్యలు తీసుకోకుండా సిటీలో డస్ట్ బిన్లను తొలగించడం వల్లే సమస్య వచ్చింది. డస్ట్ బిన్లను తొలగించడానికి ముందు.. ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించే వాహనాలను పెంచాల్సింది. డైలీ చెత్త సేకరిస్తే జనం ఇలా రోడ్లపైన వేయరు. అలాగే హాలీడేస్ సమయంలో చెత్త సేకరించేందుకు కొందరిని ఉంచాలె. రెండు, మూడ్రోజులు సెలవులు వస్తే రోడ్లపై ఎక్కడ చూసినా చెత్తే కనిపిస్తుంది.
- పద్మనాభరెడ్డి,
ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సెక్రటరీ