హైదరాబాద్, వెలుగు: ఇండ్లల్లోని చెత్తను డంపింగ్ యార్డుకు తరలించేందుకు బల్దియా ఏటా కోట్లు ఖర్చు చేస్తున్నా పెద్దగా మార్పు రావడం లేదు. డస్ట్‌బిన్‌ఫ్రీ సిటీగా మార్చి గతంలో కంటే అదనంగా వెచ్చిస్తున్నా ఎక్కడి చెత్త కుప్పలు అక్కడ్నే ఉంటున్నాయి. గడిచిన ఐదేండ్లలో చెత్తను ట్రాన్స్ఫర్ స్టేషన్లకు తరలించేందుకే బల్దియా రూ.535 కోట్లు ఖర్చు చేసిందని ఇటీవల జరిగిన కౌన్సిల్ మీటింగ్‌లో కమిషర్ లోకేశ్ కుమార్ప్రకటించారు. అందులో డస్ట్ బిన్లు తొలగించాక స్వచ్ఛ ఆటోలు, సెకండరీ ట్రాన్స్పోర్ట్వెహికల్స్ కోసమే అత్యధికంగా రూ.234 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. కానీ 2,500 ఆటోలు ఉన్నప్పుడు పరిస్థితి ఎలా ఉందో 4 వేలకు పెరిగాక కూడా అంతే ఉంది. ఏటా ఖర్చు పెరుగుతుందేగానీ క్షేత్రస్థాయిలో చెత్త సమస్య తీరడం లేదు. పైగా ప్రజలు మారాలని ఆఫీసర్లు సూచిస్తున్నారు. ప్రజల వైపు నుంచి సమస్య ఎందుకు వస్తుందనేది తెలుసుకోవడం లేదు. రోడ్ల పక్కన చెత్త వేస్తున్న వారిని అడిగితే చెత్త తీసుకెళ్లేందుకు ఇంటి వరకు స్వచ్ఛ ఆటోలు రావడం లేదని చెబుతున్నారు. ఇంట్లో అలాగే ఉంచితే దుర్వాసన భరించలేక పోతున్నామని, అందుకే రోడ్ల పక్కన ఖాళీ స్థలాల్లో పారబోస్తున్నామని సమాధానం ఇస్తున్నారు. స్వచ్ఛ భారత్మిషన్ గైడ్‌లైన్స్ పాటిస్తూ ఆఫీసర్లు సిటీలో డస్ట్బిన్లు తీసేశారే గానీ తదుపరి చర్యలపై పెద్దగా ఫోకస్ పెట్టట్లేదు.
వాటికి మళ్లీ సెపరేట్..
ఇండ్లలోంచి చెత్తను ట్రాన్స్ ఫర్ స్టేషన్లకు తరలించేందుకు జీహెచ్ఎంసీ ఐదేళ్లలో రూ.535కోట్లు ఖర్చు చేసింది. 2017కి ముందు రూ.137కోట్లతో 2,500 స్వచ్ఛ ఆటోలు కొనుగోలు చేసింది. 2020లో రూ.55కోట్లతో 650 ఆటోలు, 2021లో రూ.124 కోట్లతో1,350 ఆటోలు కొనింది. ఇవి కాకుండా సెకండరీ ట్రాన్స్‌పోర్టు వెహికల్స్కోసం నాలుగేళ్లలో రూ.218 కోట్లను కాంట్రాక్టర్లకు చెల్లించింది. ట్రాన్స్‌ఫర్‌స్టేషన్ల నుంచి డంపింగ్‌యార్డుకు తరలించే వాహనాల ఖర్చు మళ్లీ సపరేట్ గా ఉంది.
900 తొలగించి 2 వేలు కొన్నరు
గ్రేటర్ పరిధిలోని 900 డస్ట్ బిన్లు తొలగించి డస్ట్‌బిన్ ఫ్రీ సిటీగా చేశామని ఇటీవల జరిగిన కౌన్సిల్ సమావేశంలో బల్దియా కమిషనర్ లోకేశ్‌కుమార్ వెల్లడించారు. ఇండ్ల నుంచి చెత్తను తీసుకునేందుకు స్వచ్ఛ 2 వేల ఆటోలు కొన్నామన్నారు. అంటే ఒక్కో డస్ట్ బిన్ స్థానంలో రెండుకి పైగా ఆటోలు వచ్చాయి. బిన్ అయితే ఒకే స్థానంలో ఉండేది. ఆటో అనేక ప్రాంతాలు తిరిగేందుకు వీలుంటుంది. ఇంత చేసినా సిటీలోని ప్రతి 200 మీటర్లకు ఒక చెత్త కుప్ప కనిపిస్తూనే ఉంది. బస్తీలు, కాలనీల్లోనే కాదు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్ వంటి ప్రాంతాల్లోనూ చెత్త సమస్య అలాగే ఉంటోంది. ఎప్పుడూ రద్దీగా ఉండే ప్రాంతాల్లోనూ పేరుకుపోతుంది. రోజుల తరబడి అలాగే వదిలేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.
కంపు భరించలేకపోతున్నం
రోడ్లపై పేరుకుపోతున్న చెత్త నుంచి వచ్చే కంపును భరించలేకపోతున్నం. ఎక్కడ చూసినా అలాగే ఉంటోంది. మెయిన్ రోడ్ల మీద కూడా చెత్త కనిపిస్తోంది. ఆఫీసర్లేమో చెత్త తరలించేందుకు రూ. కోట్లు ఖర్చు చేస్తున్నామని చెబుతున్నారు. అయినా కూడా పరిస్థితి ఎందుకు ఇలా ఉందో అర్థమైతలేదు. అసలు ఖర్చు చేస్తున్నారా.. చేసినట్లు చూపుతున్నారా?.
- నరేశ్, గౌరీశంకర్ కాలనీ, బంజారాహిల్స్
పదేండ్లుగా ఏం మారలే
పదేండ్ల కిందట చెత్త సమస్య ఎలాగైతే ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. టెక్నాలజీ వెహికల్స్ వాడుతున్నామని మంత్రి కేటీఆర్ చెబుతున్న మాటలు అన్నీ వట్టివేనా? ఇప్పటికైనా ఆఫీసర్లు స్పందించి రోడ్ల వెంట చెత్త కుప్పలు లేకుండా చూస్తే చాలు.
- శ్రావణ్, సికింద్రాబాద్