ఆరు రోజులుగా సమ్మెలో గ్రామ పంచాయతీ కార్మికులు
- పల్లెల్లో చెత్త పేరుకుపోతున్నా సర్కార్ సైలెంట్
- అసలే వానలు..ఆపై శానిటేషన్ సమస్య
- ఆల్టర్నేట్ ఏర్పాట్లు చేయని సర్కారు
- ఈగలు, దోమలు పెరిగి రోగాల విజృంభణ
- కొన్ని చోట్ల సర్పంచ్‌లే చెత్త సేకరిస్తున్న పరిస్థితి!
ఆదిలాబాద్, వెలుగు : గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మెతో పల్లెల్లో చెత్త పేరుకపోతున్నది. అసలే వానాకాలం.. పారిశుధ్యం లోపిస్తే వ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నది. ఆఫీసర్లు ముందస్తుగానే శానిటేషన్ చర్యలు తీసుకోవాల్సి ఉన్నా ఇప్పుడు గ్రామాల్లో అవేమీ కనిపించడం లేదు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జులై 6నుంచి రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. రాష్ట్రంలో 12,769 గ్రామపంచాయతీలు ఉండగా సుమారు 40,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2020లో మల్టీపర్పస్ వర్కర్స్ ను నియమించింది. జనాభా ప్రకారం ఒక్కో గ్రామంలో ఇద్దరి నుంచి నలుగురిని నియమించింది. వీరి సమస్యలు పరిష్కరించకపోవడంతో సమ్మె బాట పట్టారు.
కంపు కొడుతున్న పల్లెలు..
పంచాయతీ కార్మికులు సమ్మెలో ఉండడంతో గ్రామాలన్నీ కంపు కొడుతున్నాయి. వానాకాలం కావడంతో సీజనల్ వ్యాధుల ప్రభావం ప్రజలను ఆందోళన కలిగిస్తున్నది. రోడ్లపై ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోతుండగా వాన నీరు, బురద, మురికి నీరు అంత రోడ్లపై వచ్చి చేరుతున్నది. దీంతో దోమలు పెరిగి వ్యాధులు ప్రబలుతాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతీరోజు తెల్లవారుజామునే గ్రామాల్లో పారిశుధ్య పనులు చేసే కార్మికులు సమ్మెలో ఉన్నప్పటికీ వారి స్థానంలో ప్రభుత్వం ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోలేదు. మురికి కాల్వలు శుభ్రం చేయడం, ఇంటింటి నుంచి చెత్త సేకరణ, డంపింగ్ యార్డ్ నిర్వహణ.. తదితర పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి.
ప్రజాప్రతినిధులే పారిశుధ్య కార్మికులు
గ్రామపంచాయతీ కార్మికులు సమ్మెలో ఉండడంతో కొన్ని గ్రామాల్లో సర్పంచులు ఇతర ప్రజాప్రతినిధులే పారిశుధ్య కార్మికులుగా పనిచేస్తున్నారు. చెత్తను ఎత్తడం ట్రాక్టర్ నడపడం వారి పనిగా మారింది. ఆఫీసర్లు పట్టించుకోకపోవడంతో ప్రజాప్రతినిధులు ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులతో తలలు పట్టుకుంటున్నారు. పల్లెల్లో రోడ్లన్నీ చెత్త కంపు కొడుతున్నాయి.
ప్రధాన డిమాండ్లు..
- గ్రామ పంచాయతీ సిబ్బంది అందరినీ పర్మినెంట్ చేయాలి.
- 11వ పీఆర్సీలో నిర్ణయించిన విధంగా మినిమం బేసిక్ రూ.19,000 వేతనం చెల్లించాలి
- జీఓ నెంబర్ 60 ప్రకారం స్వీపర్లకు రూ.15,600 పంప్ ఆపరేటర్లు, ఎలక్ట్రీషియన్లు, డ్రైవర్లు, కారోబార్, బిల్ కలెక్టర్లకు రూ.19,500 వేతనం నిర్ణయించాలి.
- ప్రమాదంలో చనిపోయిన కార్మికుడి కుటుంబానికి రూ.10 లక్షల నష్ట పరిహారం చెల్లించాలి.
- కేంద్ర ప్రభుత్వం తెచ్చిన లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి.
- అన్ని కార్మిక చట్టాలు అమలు చేయాలి.
వేతనాలు పెంచాల్సిందే..
రాష్ట్ర ప్రభుత్వం పారిశుధ్య కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా ఉంటున్నది. వెంటనే జీతాలను పెంచాలి. మా సమస్యలను పరిష్కరిస్తేనే విధుల్లో చేరుతం. అప్పటి దాక సమ్మె కొనసాగిస్తాం.
-ముంజర్ల ప్రశాంత్, పంచాయతీ కార్మికుడు, మన్నూర్ గ్రామ పంచాయతీ, గుడిహత్నూర్
సమ్మె ఉధృతం చేస్తం
గ్రామపంచాయతీ పారిశుధ్య కార్మికుల సమ్మె మొదలుపెట్టి నేటికీ 7 రోజులైనా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేదు. ఇప్పటికైనా స్పందించి మా న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి. లేదంటే 20 తేదీ నుంచి సమ్మెను మరింత ఉధృతం చేస్తం.
- జన్నారపు సాహెబ్రావ్, శానిటరీ ట్రాలీ డ్రైవర్, ఇచ్చోడ, ఆదిలాబాద్