- మానేరు తీరంలో గుట్టలుగా పేరుకుపోయిన చెత్తాచెదారం
- రోజూ 40 లారీల వేస్టేజ్ డంపింగ్ యార్డులోకి..
- నిరంతరం బయో మైనింగ్ చేస్తున్నా తగ్గని నిల్వలు
- తరలిస్తామని హామీ ఇచ్చి ఏడాది.. మాట్లాడని లీడర్లు.. ఆఫీసర్లు
కరీంనగర్, వెలుగు:మానేరు తీరంలోని డంపింగ్ యార్డు నుంచి వస్తున్న దట్టమైన పొగతో నగరవాసులకు ఊపిరాడడం లేదు. మంగళవారం రాత్రి డంపింగ్ యార్డులోని చెత్త గుట్టలకు అంటుకున్న మంటలను ఫైర్ సిబ్బంది పూర్తిగా చల్లార్చకపోవడంతో చెత్త ఇంకా మండుతూనే ఉంది. దీంతో వెలువడుతున్న పొగతో హౌసింగ్ బోర్డు కాలనీ, ఆటో నగర్, కోతిరాంపూర్, రామగుండం బైపాస్ రోడ్డు ఏరియా, బొమ్మకల్ శివారు ప్రాంతాలను పొగ కమ్మేస్తోంది. డంపింగ్ యార్డులో చెత్తశుద్ధి కోసం ప్రారంభించిన బయో మైనింగ్ ప్రాసెస్ స్లోగా నడుస్తోంది. ప్రారంభించి తొమ్మిది నెలలు దాటినా ప్రాసెసింగ్ 20 శాతం కూడా పూర్తి కాలేదు. ఏడాదిలో చెత్తనంతా పూర్తిగా తొలగిస్తామని హామీ ఇచ్చిన లీడర్లు, ఆఫీసర్లు నోరుమెదపడం లేదు. చెత్తను పూర్తిగా తొలగించే పరిస్థితి లేకనే మున్సిపల్ ఆఫీసర్లు తమ సిబ్బందితో కుప్పలకు నిప్పు పెట్టిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
రోజూ 184 టన్నుల చెత్త డంపింగ్ యార్డులోకి..
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లలోని 78 వేల ఇళ్ల నుంచి ప్రతీ రోజు సుమారు 184 మెట్రిక్ టన్నుల చెత్త వెలువడుతోంది. సుమారు నాలుగు లక్షల పై చిలుకు జనాభా ఉన్న కరీంనగర్ సిటీలో ఇళ్ల నుంచేగాక, దుకాణాలు, హోటళ్లు, చికెన్ సెంటర్ల నుంచి వెలువడే చెత్తనంతా మానేరు తీరంలోని డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. రోజూ సుమారు 20 నుంచి 30 లారీల చెత్త వస్తుందని అంచనా. గత 50 ఏళ్లుగా బైపాస్‌రోడ్డులోని మానేరు ఒడ్డున ఉన్న తొమ్మిది ఎకరాల స్థలంలో చెత్తను డంప్ చేస్తున్నారు. ఇలా ఏళ్లుగా పేరుకుపోయిన చెత్త... ఇప్పుడు గుట్టలా మారింది. చిన్నగా మంటలు అంటుకున్నా.. నిమిషాల వ్యవధిలో డంప్ యార్డు మొత్తం అంటుకుంటోంది.
రోజూ బయో మైనింగ్ చేసినా తరగని నిల్వలు
మానేరు ఒడ్డున పేరుకుపోయిన చెత్తను తగ్గించడంతో పాటు మట్టిగా మళ్లీ వినియోగించేలా చేసేందుకు మున్సిపల్ కార్పొరేషన్ బయోమైనింగ్ ను మొదలు పెట్టింది. ఇందుకోసం స్మార్ట్ సిటీ నిధుల కింద రూ.16 కోట్లు మంజూరు చేసింది. టెండర్లు దక్కించుకున్న చెన్నైకి చెందిన సంస్థ పనులు చేపట్టింది. నిరుడు జూన్ లో చెత్తను ప్రాసెస్ చేయడం ప్రారంభించింది. అగ్రిమెంట్ ప్రకారం ఏడాదిలో డంపింగ్ యార్డును పూర్తిగా క్లీన్ చేసి ఇవ్వాల్సి ఉంది. కానీ గత తొమ్మిది నెలల్లో కంపెనీ మూడు షిఫ్టులుగా వర్కర్స్ తో పని చేయిస్తున్నప్పటికీ టార్గెట్ ను రీచ్ కాలేకపోయింది. రోజూ 30 లారీల చెత్త వెలువడుతుండగా.. సదరు కంపెనీ రోజుకు ఐదారు లారీల చెత్తను కూడా ప్రాసెస్ చేయలేకపోతోంది. వర్షాలు పడినా, టెక్నికల్ గా ఏదైనా సమస్య తలెత్తినా ప్రాసెసింగ్ నిలిచిపోతోంది.
పొగతో స్థానికులకు అనారోగ్య సమస్యలు
చెత్త కాలిన వాసన, పొగ చుట్టూ రెండు, మూడు కిలోమీటర్ల మేర వస్తోంది. పొగతో శ్వాస సంబంధిత సమస్యలతోపాటు తలనొప్పి, వికారం, కళ్ల మంటలతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. పొగతో పిల్లలు దగ్గు, జలుబు, అస్తమాలాంటి రోగాల బారినపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డంప్‌యార్డు పెద్దపల్లి బైపాస్ రోడ్డుకు ఆనుకుని ఉండడంతో పొగతో అటు వైపుగా వెళ్లే వాహనదారులకు రోడ్డు కూడా సరిగ్గా కనిపించడం లేదు. డంపింగ్ యార్డును వీలైనంత త్వరగా ఇక్కడి నుంచి తరలించాలని కోరుతున్నారు.
ఎండాకాలం వచ్చిందంటే మంటలు..
ఎండాకాలం వచ్చిందంటే చాలు.. డంపింగ్ యార్డులో మంటలు అంటుకోవడం, పొగ వ్యాపించడం, స్థానికులు ఊపిరాడక ఇబ్బందిపడడం పరిపాటిగా మారింది. వరుసగా మూడేళ్లుగా ఇదే తంతు నడుస్తోంది. దీంతో మంటలు ప్రమాదవశాత్తూ అంటుకుంటున్నాయా.. లేదా కావాలనే మున్సిపల్ సిబ్బంది నిప్పు పెడుతున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డంపింగ్ యార్డులో ప్రతి ఆరు నెలలకోసారి మంటలు వస్తున్నాయని, మంటలను ఆర్పిన తర్వాత కూడా రోజుల తరబడి పొగ వ్యాపిస్తుండటంతో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు చెబుతున్నారు.
డంపింగ్ యార్డును తరలించాలి
డంపింగ్ యార్డుతో చాలా ఇబ్బందులు పడుతున్నం. పొగతో ఊపిరాడట్లేదు. వాసన భరించలేకపోతున్నం. కొత్తగా ఇక్కడికి చెత్తను తరలించడం ఆపివేయాలి. సిటీకి దూరంగా వేరే చోట డంపింగ్ చేయాలి. ఆఫీసర్లకు, లీడర్లకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు.
– వగ్గర మల్లేశం, ఆటో నగర్